చౌటుప్పల్,వెలుగు : నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కాలుష్యం వెదజల్లుతున్న కంపెనీలపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి కలెక్టరేట్ లో అభివృద్ధి- సంక్షేమ పథకాలపై నిర్వహించిన 'దిశ' మీటింగ్‌లో ఆయన 19 డిపార్లమెంట్లపై రివ్యూ నిర్వహించారు.
చౌటుప్పల్ మండలంలో కంపెనీలు వెదజల్లుతున్న కాలుష్యంపై పొల్యూషన్కంట్రోల్బోర్డు ఆఫీసర్సురేశ్ను ప్రశ్నించారు. కాలుష్యం కారణంగా దోతిగూడెం వంటి గ్రామాల్లో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న విషయాన్ని ప్రస్తావించారు. కంపెనీలు కాలుష్యాన్ని నేరుగా భూమిలోకి పంపిస్తుంటే మీరేం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కంపెనీలు వెదజల్లుతున్న కాలుష్యంపై వచ్చే పార్లమెంట్‌సమావేశాల్లో ప్రస్తావిస్తానని తెలిపారు. అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి రావాల్సిన వాటా కచ్చితంగా తీసుకుంటామని స్పష్టం చేశారు.
కేంద్రం అమలు చేసే స్కీమ్స్కోసం చెల్లించాల్సిన వాటాను గత ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. రైల్వే స్టేషన్లో ట్రైన్ల హాల్టింగ్‌ను క్యాన్సిల్ చేయడం వల్ల జనగామ, ఆలేరు, భువనగిరి సహా అనే ప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ప్రజలు కోల్పోతున్న విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు.
గతం కంటే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించడంలో భాగంగా ఎక్కువ ట్రైన్లకు హాల్టింగ్ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖాధికారులకు సూచించారు. చిట్యాల-–-భువనగిరి రోడ్డు విస్తరణ కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి అనుమతులు సాధిస్తామని తెలిపారు. మీటింగ్‌లో ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేల్, కలెక్టర్హనుమంతు జెండగే, అడిషనల్కలెక్టర్గంగాధర్, డీఆర్డీవో ఎంఏ కృష్ణన్, జడ్పీ సీఈవో శోభారాణి, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు.