
హైదరాబాద్, వెలుగు: వేసవి నేపథ్యంలో మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో తాగు నీటి సమస్య రాకుండా జాగ్రత్తలు వహించాలని మున్సిపల్ కమిషనర్లను సీడీఎంఏ ( కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ ) టీకే శ్రీదేవి ఆదేశించారు. మిషన్ భగీరథ, వాటర్ బోర్డు అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చెత్త సేకరణ , నిర్వహణపై దృష్టి పెట్టాలని, ప్రతి రోజు ఈ అంశంపై పర్యవేక్షణ ఉంటుందన్నారు.
గురువారం జూబ్లీహిల్స్లోని ఎంసీహెచ్ ఆర్డీలో మున్సిపల్ కమిషనర్లతో టీకే శ్రీదేవి, డీటీసీపీ దేవేందర్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఈఎన్సీ భాస్కర్ రెడ్డిలు సమావేశమయ్యారు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు 85 శాతంపైగా వసూలు చేసిన 31 మంది కమిషనర్లను, 75 నుంచి 85 శాతం వసూలు చేసిన39 మంది కమిషనర్లను, గత రెండేళ్లుగా ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న 12 మంది కమిషనర్లను టీకే శ్రీదేవి సన్మానించారు.
2025-26 ఫైనాన్సియల్ ఇయర్ కు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే వారికి 5 శాతం రాయితీ కల్పించామన్నారు. ఈ అంశంపై కమిషనర్లు అవగాహన కల్పించాలని శ్రీదేవి ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ చెల్లించేందుకు ఈ నెల చివరి వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందన్నారు. డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ..ఎల్ఆర్ఎస్ ఫీజు త్వరగా చెల్లించేలా పబ్లిక్ ను ఎంకరేజ్ చేయాలనికోరారు. బిల్డ్ నౌ కొత్త అప్లికేషన్ పై కమిషనర్లకు ఆయన పలు సలహాలు, సూచనలు చేశారు. సమావేశంలో సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్లు శ్రీనివాస్, శ్రీధర్, సంధ్య , నారాయణరావు పాల్గొన్నారు.