గణేష్ ఉత్సవాల్లో మహిళలు, పిల్లల భద్రతకు ప్రాధాన్యత

గచ్చిబౌలి, వెలుగు: గణేశ్ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ ​మహంతి కోరారు. ఉత్సవాల్లో మహిళలు, చిన్న పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గణేశ్​ ఉత్సవాలపై గచ్చిబౌలిలోని సైబరాబాద్​కమిషనరేట్ ఆఫీస్​లో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఆర్అండ్ బీ, హెచ్ఎండబ్ల్యూఎస్​ అండ్​ ఎస్​బీ, ఫైర్​సర్వీసెస్, ట్రాన్స్​పోర్ట్, ఆర్టీఏ, ఇతర శాఖల అధికారులు, భాగ్యనగర్ ​ఉత్సవ కమిటీ సభ్యులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

సెప్టెంబర్​7 నుంచి 17 వరకు ఉత్సవాలు జరగనున్నాయన్నారు. కమిషనరేట్​పరిధిలోని నిర్వహణ కమిటీల వివరాలను ఆయా పోలీస్​ స్టేషన్ల​అధికారులు, సిబ్బంది సేకరించుకోవాలని సూచించారు. భక్తులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్​ మీడియాలో వచ్చే తప్పుడు పోస్టులను ఎవరూ నమ్మవద్దని, అలాంటి పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఉత్సవాలకు ముందే రోడ్ల రిపేర్లు, పారిశుధ్య పనులు పూర్తి చేయాలని మేడ్చల్- మల్కాజిగిరి కలెక్టర్​ గౌతమ్​ పోట్రు అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి అడిషనల్​ కలెక్టర్​ ప్రతిమా సింగ్, సైబరాబాద్​ ట్రాఫిక్​ జాయింట్​ సీపీ జోయల్​ డేవిస్​, డీసీపీలు, జీహెచ్ఎంసీ జోనల్​ కమిషనర్లు, ఆర్​అండ్​బీ అధికారులు, ఫైర్, ఆర్టీఏ శాఖలు, వాటర్​బోర్డు ఆఫీసర్లు, గణేశ్​ఉత్సవ సమితి సైబరాబాద్​ ఇన్ చార్జి మహిపాల్​రెడ్డి పాల్గొన్నారు.