కాగజ్ నగర్, వెలుగు: సీసీ రోడ్డు పనులు చేసి నెలలు గడిచినా బిల్లు చెల్లించకపోవడంతో ఓ కాంట్రాక్టర్ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను తీసుకెళ్లి ఇంటిముందు పెట్టుకున్నాడు. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలం లంబాడిగూడకు చెందిన పెంటయ్య 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈజీఎస్ కింద గ్రామంలో రూ.5 లక్షల విలువైన సీసీ రోడ్డు పనులు చేశాడు.
గ్రామ పంచాయతీ ఖాతాలో బిల్లు జమైంది. అయితే మూడు నెలలుగా బిల్లు కోసం తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. ఈ విషయమై కలెక్టర్కు కంప్లైంట్ చేసినా బిల్లు చేతికందకపోవడంతో గ్రామపంచాయతీ ట్రాక్టర్ను తీసుకెళ్లి ఇంటి ముందు పెట్టుకున్నాడు. బిల్లు చెల్లించేదాకా ట్రాక్టర్ను ఇచ్చేది లేదని స్పష్టం చేశాడు.