బషీర్ బాగ్, వెలుగు : సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని , తొలగించబడిన హోంగార్డులు ప్రభుత్వాన్ని కోరారు. వివిధ కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా మూడు వందల మందిని సర్వీస్ నుంచి తొలగించారని తెలిపారు. తమను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆర్డర్ ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లక్డికపుల్ లోని డీజీపీ ఆఫీసుకు బుధవారం వచ్చారు. కానిస్టేబుల్స్‌తో సమానంగా ఈవెంట్స్ లో మెరిట్ సాధించి ఉద్యోగాలు పొందామని, డ్యూటీలకు సరిగ్గా రావడం లేదనే కారణంతో డిస్మిస్ చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో తమ గోడు చెప్పుకొనేందుకు వెళ్తే ఎమ్మెల్యేలు కూడా కలవలేదన్నారు. గతంలో తమ హోంగార్డు ఒకరు ఆత్మహత్య చేసుకోగా అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. హామీ మేరకు ఉద్యోగాలివ్వాలని కోరారు.