రాజ్ భవన్-ప్రగతి భవన్ మధ్య గ్యాప్ పెరిగిందా..? గవర్నర్ స్వతహాగా తీసుకుంటున్న నిర్ణయాలతో సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారా..? పాలన విషయాలలో గవర్నర్ జోక్యం చేసుకోవడంతో కేసీఆర్ కు మింగుడు పడటం లేదా..? గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేసీఆర్ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలేం జరిగింది?
కొన్ని విభాగాల సమీక్షలు నిర్వహించిన గవర్నర్
రాష్ట్రంలో గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత తమిళిసై నేరుగా కొన్ని విభాగాల సమీక్షలు నిర్వహించారు. వైద్య, విద్యాశాఖపై రివ్యూ చేశారు. యూనివర్సిటీల వీసీల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం పని తీరు మెరుగు పర్చాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలని..అనేక సందర్భాల్లో ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో రాజ్ భవన్ - ప్రగతి భవన్ మధ్య గ్యాప్ పెరిగిందనే చర్చ అంతటా జరుగుతోంది. అదే సమయంలో ముఖ్యమంత్రికి తెలియకుండా సంబంధింత శాఖల వివరాలను గవర్నర్ తెప్పించుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
ప్రజా దర్బార్ ను ఎందుకు ఏర్పాటు చేస్తామన్నారు
ప్రజా సమస్యలపై తనకు ఫిర్యాదులు వస్తున్నాయని ఇందుకోసం ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు గవర్నర్. హుజురాబాద్ ఉప ఎన్నికల ముందు పాడి కౌశిక్ రెడ్డి ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా నియమిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిని ఆమోదించే విషయంలోనూ గవర్నర్ కొంత ఆలస్యం చేశారు. చివరికి సాంస్కృతిక కోటాలో అర్హతలను పరిశీలించాల్సి ఉందని తమిళిసై స్పష్టం చేశారు. దీంతో గవర్నర్ కోటాలో కాకుండా కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో మండలికి ఎంపిక చేశారు. అంతర్గతంగా కారణాలేమైనా కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆమోదించక పోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఇందిరా పార్కు దగ్గర టీఆర్ఎస్ ధర్నా చేసిన తర్వాత రాజ్ భవన్ కు వెళ్లి సీఎం మెమోరాండం ఇస్తారని ప్రచారం జరిగింది. ఐతే లాస్ట్ మినిట్ లో ఏమైందో ఏమో తెలియదు కానీ.... సీఎం రాజ్ భవన్ కు వెళ్లకుండా కేవలం మంత్రులు, ఇతర నేతలనే పంపించారు. బల్దియా ఎన్నికల తర్వాత బీజేపీ నేతలు అనేక సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విషయాల్లో గవర్నర్ నేరుగా జోక్యం చేసుకోవడం వల్లే సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు దూరంగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది.
తాజాగా రాజ్ భవన్ లో గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హాజరు కాలేదు. దీంతో మరోసారి రాజ్ భవన్ కు - ప్రగతి భవన్ కు గ్యాప్ పెరిగిందనే వార్తలు గుప్పుమన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సీఎం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే కు సీఎం వెళ్లకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని విమర్శిస్తున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గణతంత్ర వేడుకలకు హాజరు కాకపోవడం....రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
మరిన్ని వార్తల కోసం
పైపు పగిలి రోడ్డు పాలవుతున్న మంచి నీళ్లు
నెలరోజుల్లో హైకోర్టుకు కొత్త జడ్జిలు