వరంగల్, వెలుగు: కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి కరోనా అడ్డువచ్చిందని చెబుతున్న మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ కు, మద్రాస్, తిరుపతిలో తాను కడుతున్న షాపింగ్ కాంప్లెక్స్‌లు, బిల్డింగులకు అడ్డురాలేదా చెప్పాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మండిపడ్డారు. రాజభోగాలు అనుభవించే నిర్మాణాలు, సెక్రటేరియట్ తప్పించి 10 ఏండ్లలో పూర్తి చేయని కాళోజీ కళాక్షేత్రానికే సాకులు దొరికాయా అంటూ ప్రశ్నించారు.
ఆదివారం ఆయన హనుమకొండ కాంగ్రెస్ భవన్లో ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. వినయ్‌భాస్కర్ శిలాఫలకాలు వేసి పనులు పూర్తయినట్లు కలలు కనడం తప్ప, నిధులు తేలేని అసమర్థుడని విమర్శించారు. కళాక్షేత్రం పేరుతో కమీషన్లు తీసుకుని తుప్పుపట్టిన సలకల బిల్డింగ్ వదిలేస్తే, తాము మళ్లీ పనులు మొదలుపెట్టామన్నారు. కాళోజీ కళాక్షేత్రం ఒక్కటే కాదని, మాడవీధులు, నయీంనగర్ నాలా, ఫాతిమా బ్రిడ్జి వంటి ప్రాజెక్టులకు ప్రపోజల్స్ పేరుతో శిలాఫలకాలు వేసి వాటిని కట్టినట్లు పగటి కలలు కనడం తప్ప నిధులు మంజూరు చేయడంలో ఫెయిల్ అయ్యాడన్నారు.
ఈ విషయంలోనూ చర్చకు రావడానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రానికి సోమవారం సెంట్రల్ ఫైనాన్స్ కమిటీ రానుందని, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అవసరమైన నిధుల విషయమై సీఎం చర్చించాల్సి ఉన్నందున, కాళోజీ కళాక్షేత్రం ప్రారంభాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. నేతలు, కార్పొరేటర్లు అజీజ్‌ఖాన్, తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, బత్తిని శ్రీనివాస్, వీరగంటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.