అప్పుడు కూల్చిన్రు.. ఇప్పుడు పర్మిషన్లు ఇస్తున్రు!

అప్పుడు కూల్చిన్రు..  ఇప్పుడు పర్మిషన్లు ఇస్తున్రు!
  • సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ 947 సర్వే నంబర్ లో ఆఫీసర్ల భూ మాయ? 
  • 8 ఎకరాల శెట్టికుంట ఎఫ్ టీఎల్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు
  • 2015లో కాలనీనే నేలమట్టం చేసి ఇప్పుడు పర్మిషన్లేంటని పలువురి ప్రశ్న  
  • నీళ్ల మధ్యలోనే ఇండ్లు.. మరో 9 ఎకరాల కబ్జాకు ప్లాన్!

సంగారెడ్డి/రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం అమీన్​పూర్​ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 947లో ఏడేండ్ల కింద అక్రమ నిర్మాణాలు వెలిస్తే అధికారులు కూల్చేశారు. అదే స్థలంలో ఇప్పుడు కొందరు అధికారుల ద్వారా పర్మిషన్లు తీసుకొని జోరుగా నిర్మాణాలు  చేపడుతున్నారు. ఇప్పటికే శెట్టికుంట ఎఫ్​టీఎల్​లో ఎనిమిది ఎకరాల్లో నిర్మాణాలు జరుగుతుండగా, మరో తొమ్మిది ఎకరాలకు ఎసురు పెట్టేందుకు ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇదీ పరిస్థితి.. 

పటాన్ చెరు నియోజకవర్గం అమీన్​పూర్​ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 947లో దాదాపు 17 ఎకరాలలో శెట్టికుంట విస్తరించి ఉంది. చెరువులు, ఎఫ్ టీ ఎల్ పరిధిలలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయితే దశాబ్దాల కిందట ఆ భూములు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం కొందరికి అనుమతి ఇచ్చింది. వారి నుంచి ఆ భూములను రియాల్టర్లు అక్రమంగా కొనుగోలు చేశారు. 2014 నుంచి ఇండ్ల నిర్మాణాలు చేపట్టి ఓ కాలనీనే ఏర్పాటు చేశారు. ఈ తతంగాన్ని 2015లో గుర్తించిన అప్పటి అధికారులు ఆర్డీఓ మధుసూదన్​ రెడ్డి నేతృత్వంలో ఆ భూముల్లోని దాదాపు 90 ఇండ్లను నేలమట్టం చేశారు. 

భవిష్యత్​లో ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు కట్టొద్దని, రిజిస్ట్రేషన్లు చేయొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఏడాది పాటు ఆ భూముల జోలికి ఎవరూ వెళ్లలేదు. కానీ ఇటీవల అక్కడ కొత్తగా ఇండ్లు వెలిశాయి. కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాడు అక్రమ నిర్మాణాలని కూల్చిన స్థలంలోనే నేడు పర్మిషన్లు ఇవ్వడమేంటని అధికారులపై, కబ్జాదారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి ఎఫ్ టీఎల్ పరిధిలో కొనసాగుతున్న అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇండ్ల చుట్టూ నీళ్లే.. 

శెట్టికుంట ఎఫ్ టీఎల్ చుట్టూ వెలిసిన ఇండ్ల నిర్మాణాల మధ్య వర్షం నీరు భారీగా నిలుస్తోంది. చెరువుల పక్కన ఇండ్లు కట్టొద్దన్న నిబంధనలు ఉన్నప్పటికీ అక్రమార్కుల చేతిలో మోసపోయిన ఎంతోమంది అమాయకులు ఇండ్లు కొట్టుకొని ఇప్పుడు బాధపడుతున్నారు. చిన్న పాటి వర్షానికే ఇండ్లలోకి నీళ్లొస్తున్నాయి. 

చర్యలు తీసుకుంటాం

నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను.  అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని శెట్టికుంట ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నట్టు తెలియదు.  గతంలో కూల్చివేతల గురించి కూడా తెలియదు.  మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ కు విషయం చెప్పి పరిశీలించమని చెబుతాను. ఒకవేళ అక్రమ నిర్మాణాలు నిజమైతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.  ప్లాట్ల కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అక్రమార్కులను నమ్మి మోసపోవద్దు.

ఆర్డీవో రవీందర్ రెడ్డి