
- 70 కవితలతో రచించిన డాక్టర్ జయశ్రీ
జూబ్లీహిల్స్, వెలుగు: డాక్టర్ జయశ్రీ 70 కవితలతో రచించిన ‘తలగూర గంప’ కవితల పుస్తకాన్ని ప్రముఖ సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు బుధవారం ఆవిష్కరించారు. జయశ్రీ 70వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా బుధవారం జూబ్లీహిల్స్‌లోని విస్పర్ వ్యాలీలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ ఏవీ గురవారెడ్డి, మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు కె.మాధవరావు, డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు, డాక్టర్ బాలమ్మ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జొన్నవిత్తుల మాట్లాడుతూ.. డాక్టర్ జయశ్రీ రచించిన తలగూర గంప పుస్తకంలోని కవితలు జీవితానుభూతులను ఇస్తుందన్నారు. ఆమె రాసిన 70 కవితలు అద్భుతంగా ఉన్నాయని, కవితల శీర్షికలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయన్నారు.
రచయిత జయశ్రీ మాట్లాడుతూ.. ఇప్పటితరం మన మాతృభాషను పూర్తిగా మర్చిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగును మర్చిపోతే అమ్మను మర్చిపోయినట్లే అని, అలా జరగనివ్వనని అన్నారు. తెలుగు భాష అభివృద్ధి కోసం అమ్మమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తానని, తెలుగు భాషా ప్రాముఖ్యత, మన సంస్కృతిని ఈతరం పిల్లలకు తెలిసేలా చేస్తానని తెలిపారు. ఆ ఫౌండేషన్ ద్వారా నిమిషం వీడియోలు తీసి పిల్లలకు చేరేలా కృషి చేస్తానని చెప్పారు.