తీర్మానం చేస్తే సరిపోదు.. కులగణనకు చట్టబద్ధత కల్పించాలి: తలసాని

తీర్మానం చేస్తే సరిపోదు.. కులగణనకు చట్టబద్ధత కల్పించాలి: తలసాని
  • బీసీల లెక్కలపై అనుమానాలున్నయ్
  • జీహెచ్ఎంసీలో 30% మంది సర్వేలో పాల్గొనలేదు
  • మళ్లీ సర్వే చేయాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం కేవలం కులగణన సర్వే నిర్వహించి, అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోదని.. దానికి చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం అసెంబ్లీలో కులగణన సర్వే రిపోర్టుపై చర్చలో ఆయన మాట్లాడారు. బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని అన్నారు.

బీసీలు ఎన్నో దశాబ్దాలుగా తమ హక్కుల కోసం పోరాడుతున్నారని చెప్పారు. ‘‘ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేపై కొన్ని వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. గత 15 ఏండ్లలో బీసీల జనాభా పెద్దగా పెరగలేదని సర్వే చెబుతున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.54 కోట్ల మంది. ప్రస్తుత సర్వే ప్రకారం.. ఈ 14 ఏండ్లలో కేవలం 14 లక్షల జనాభానే పెరిగిందా?” అని ప్రశ్నించారు.

ఏ కులం జనాభా ఎంత పెరిగిందో ప్రభుత్వం వెల్లడించాలని తలసాని డిమాండ్ చేశారు. ‘‘జీహెచ్‌‌ఎంసీ పరిధిలో 30 శాతం మంది కులగణన సర్వేలో పాల్గొనలేదని తెలుస్తున్నది. చాలామంది తమ వివరాలు చెప్పలేదు. సర్వే కోసం 56 అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. అనేక అంశాలు ఉండడంతో చాలామంది సర్వేలో పాల్గొనలేదు. ఫార్మాట్‌‌ను మార్చి మళ్లీ సర్వే చేయాలి” అని డిమాండ్ చేశారు. ‘‘దేశాభివృద్ధిలో, రాష్ట్రాభివృద్ధిలో వెనుకబడిన వర్గాలది కీలకపాత్ర. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని బీసీలు భావిస్తున్నారు. జనాభా దామాషా మేరకు రాజకీయ న్యాయం జరగాలి. సర్వే ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి” అని కోరారు.