- ప్రొటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నరు: తలసాని
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది టైమ్ ఇచ్చామని.. హైదరాబాద్ అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సనత్నగర్ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఇక నుంచి ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామన్నారు. గురువారం గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. ప్రజా ప్రతినిధులను బల్దియా అధికారులు అవమానిస్తున్నారని, ప్రొటోకాల్ కూడా పాటించడం లేదన్నారు.
ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఫోన్ చేస్తే అధికారులు ఎత్తడం లేదని, నంబర్లు బ్లాక్ లిస్టులో పెడుతున్నారన్నారు. ఈ విషయాన్ని కమిషనర్‌కు చెప్పామన్నారు. కౌన్సిల్‌లో బీఆర్ఎస్ పార్టీదే మెజార్టీ అయినప్పటికీ పట్టించుకోవడం లేదని, వారు తలచుకుంటే సభను నడపగలుగుతారా? అని తలసాని ప్రశ్నించారు. కాగా, కాంగ్రెస్‌లోకి వెళ్లిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సిటీని దోచుకుంటున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిల్డర్లు, హోటళ్ల యాజమాన్యాలను బెదిరించి అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.