- ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్, వెలుగు : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ప్రకటించిన తులం బంగారం ఎప్పుడు ఇస్తారని అర్హులైన మహిళలు ప్రశ్నిస్తున్నారని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మంగళవారం ఆయన సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీసులో బేగంపేట, రాంగోపాల్ పేట, మోండా మార్కెట్, బన్సీలాల్ పేట డివిజన్లకు చెందిన 70 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. కాంగ్రెస్అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆర్డీఓ, తహసీల్దార్లను కోరారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించడంలోనూ జాప్యం జరుగుతోందన్నారు.
సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, బేగంపేట, బన్సీలాల్ పేట కార్పొరేటర్లు టి.మహేశ్వరి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్, తహశీల్దార్ పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.