- 20 ఏండ్ల కిందటి లెక్కనే తాలిబాన్ల పాలన
- అమ్మాయిలపై అడుగడుగునా ఆంక్షలు
- నిరసనలను కవర్ చేశారని జర్నలిస్టులపై దాడులు
కాబూల్: మొన్నటి దాకా కొంగ జపం చేశారు తాలిబాన్లు. తాము మారిపోయామని చెప్పారు. అందరినీ క్షమించేశామన్నారు. ఆడవాళ్లను ప్రభుత్వంలోకి తీసుకుంటామన్నారు. అఫ్గాన్ అధికార పగ్గాలు చేపట్టగానే అసలు రూపం బయటపెడుతున్నారు. విధ్వంసానికి దిగుతున్నారు. మహిళలను అణిచేస్తున్నారు. ఇండ్లలోకి దూరి దాడులు చేస్తున్నారు. విదేశీ రాయబార కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటున్నారు. నిరసనలను కవర్ చేసిన జర్నలిస్టులపై హింసకు పాల్పడుతున్నారు. అచ్చం 20 ఏళ్లకు ముందు మాదిరే ఉంది వాళ్ల వ్యవహారం. తాలిబాన్ 1.0 లెక్కనే తాలిబాన్ 2.0 ఉంది. విధ్వంసం.. అరాచకం.. ఏమీ మారలేదు. కాలమే కాస్త ముందుకు జరిగిందంతే.
జర్నలిస్టులను చితకబాది..
కాబూల్‌లో మహిళల నిరసన ప్రదర్శనలను కవర్ చేసిన పలువురు అఫ్గాన్ జర్నలిస్టులను తాలిబాన్లు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు జర్నలిస్టులను ఓ గదిలో బంధించి.. రక్తం వచ్చేలా కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అమెరికా జర్నలిస్టు మార్కస్ యమ్ ట్వీట్ చేశారు. తమను దారుణంగా హింసించారని బాధిత జర్నలిస్టులు తాఖి దర్యాబీ, నిమత్ నఖ్దీ వాపోయారు. ‘‘ఒక తాలిబన్ నా తలపై కాలు పెట్టి నలిపేశాడు. మొఖాన్ని చిదిమేశాడు. నన్ను చంపేస్తారని అనుకున్నా. వీడియోలు తీయొద్దని హెచ్చరించాడు” అని నఖ్దీ చెప్పాడు.
స్టూడెంట్ల మధ్య ‘తెర’గతులు
ఈ మధ్యనే అఫ్గాన్‌లో యూనివర్సిటీలు ఓపెన్ అయ్యాయి. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య తెరలు పెట్టారు. కో ఎడ్యుకేషన్‌ను రద్దు చేసిన తాలిబాన్లు.. అమ్మాయిలు సపరేట్ గా చదువుకోవాలని, వాళ్ల క్లాసులు ఐదు నిమిషాలు ముందుగానే పూర్తవ్వాలని ఆదేశాలిచ్చారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకేసారి బయటికి వస్తే మాట్లాడుకుంటారనే ఇలా చేస్తున్నారు. అబ్బాయిలు వెళ్లిపోయేదాకా అమ్మాయిలు వెయిటింగ్ రూమ్స్‌లో ఉండాలని, ఇలా అమ్మాయిల చదువుపై తాలిబాన్లు చాలా ఆంక్షలు విధించారు.
అహ్మద్ షా మసూద్ సమాధి ధ్వంసం
గెరిల్లా కమాండర్, పంజ్‌షీర్ నేత అహ్మద్ షా మసూద్ సమాధిని తాలిబాన్లు ధ్వంసం చేశారు. మసూద్ 20వ వర్ధంతి సందర్భంగా ఈ పనికి పాల్పడ్డారు. పంజ్‌షీర్‌ను స్వాధీనం చేసుకున్నాక బజారక్‌లోని మసూద్ సమాధి దగ్గరికి వెళ్లిన తాలిబాన్లు.. అక్కడ సమాధి రాయిని, అద్దాలను పగులగొట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తాలిబాన్ల రిలీజ్ చేశారు. 2001లో కూడా రెండు పెద్ద బుద్ధ విగ్రహాలను తాలిబాన్లు ధ్వంసం చేశారు.
గోడలపై గీసిన బొమ్మలకు పెయింట్
‘ఆర్ట్ లార్డ్స్’ పేరుతో కొందరు ఆర్టిస్టులు కాబూల్ వీధుల్లో పెయింటింగ్స్ వేశారు. అమెరికా పోలీసు కాళ్ల కింద నలిగిపోయిన జార్జి ఫ్లాయిడ్, ఇరాన్‌లో అఫ్గాన్ రెఫ్యూజీల గురించి బొమ్మలు వేశారు. అయితే అవేవీ కనిపించకుండా తాలిబాన్లు రంగులేశారు. వాటిపై తాలిబాన్ల గెలుపు స్లోగన్లు, వాళ్ల జెండాల బొమ్మలు గీశారు.
మహిళలు పిల్లల్ని మాత్రమే కనాలి..
‘‘ప్రభుత్వంలో మహిళలు అవసరం లేదు. వాళ్లు మంత్రులుగా పనిచేయలేరు. మహిళలు పిల్లలను మాత్రమే కనాలి..” అంటూ తాలిబాన్ అధికార ప్రతినిధి సయ్యద్ జెక్రుల్లా హషిమి ‘టోలో’ న్యూస్ ఇంటర్వ్యూలో తేల్చిచెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలకు మంత్రి పదవులు ఇవ్వడమంటే.. వాళ్లు మోయలేని దానిని నెత్తిమీద పెట్టినట్లేనని జెక్రుల్లా అన్నారు. నిరసనలు చేస్తున్న మహిళలను అఫ్గాన్ మహిళలందరికీ ప్రతినిధులు కాదన్నారు. మహిళలకు ఆటలు కూడా అవసరం లేదని, వాళ్లు ఆటలాడితే ముఖం, చేతులు ఎక్స్ పోజ్ అవుతాయని, ప్రపంచమంతా చూస్తుందంటూ ఇప్పటికే తాలిబాన్ కల్చరల్ కమిషన్ డిప్యూటీ చీఫ్ అహ్మదుల్లా కామెంట్ చేశారు.
నార్వే రాయబార కార్యాలయంలో విధ్వంసం
కాబూల్‌లోని నార్వే ఎంబసీ ఆఫీస్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. లోపల ఉన్న వైన్ సీసాలు, పుస్తకాలను ధ్వంసం చేశారు. తమ ఎంబసీని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారని, తర్వాత అప్పగిస్తామని వాళ్లు చెప్పారని ఇరాన్‌లో నార్వే రాయబారి సిగ్వల్డ్ ట్వీట్ చేశారు.
అధికారులూ వచ్చేయండి: తాత్కాలిక పీఎం అఖుంద్
గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులంతా వెనక్కి రావాలని, రక్షణ కల్పిస్తామని అఫ్గాన్ తాత్కాలిక ప్రధాని హసన్ అఖుంద్ పిలుపు నిచ్చారు. రక్తపాత కాలం ముగిసిందని, దేశాన్ని మళ్లీ నిర్మించుకోవాలన్నారు. ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకున్నామని చెప్పారు.