తాలిబాన్ల కేబినెట్ విస్తరణ.. మహిళలకు నో ఛాన్స్

తాలిబాన్ల కేబినెట్ విస్తరణ.. మహిళలకు నో ఛాన్స్

కాబూల్: అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబాన్లు మరోసారి కేబినెట్‌ను విస్తరించారు. కొత్తగా పలువుర్ని డిప్యూటీ మినిస్టర్లుగా నియమించిన తాలిబాన్లు.. మరోసారి మహిళలకు మొండిచేయి చూపారు. మహిళలు, మైనారిటీ వర్గాలతో ప్రభుత్వం వ్యవహరించే తీరును బట్టే అఫ్గాన్‌ను గుర్తిస్తామని ప్రపంచ దేశాల నుంచి వస్తున్న హెచ్చరికలను తాలిబాన్లు అంతగా పట్టించుకోలేదు. రాజధాని కాబూల్‌లో నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో తాలిబాన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ కొత్త మంత్రుల జాబితాను వెల్లడించారు. కేబినెట్‌లో మహిళలకు చోటు కల్పించకపోవడాన్ని సమర్థించుకున్న ముజాహిద్.. హజారస్ లాంటి మైనారిటీ వర్గానికి చెందిన సభ్యులకు అవకాశం ఇచ్చామన్నారు. కొన్నాళ్ల తర్వాత మహిళలకూ మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని స్పష్టం చేశారు.