అఫ్గానిస్థాన్‌ను తమ చేతిలోకి తెచ్చుకున్న తాలిబాన్లు మరోసారి షరియా చట్టాల అమలు పేరుతో హక్కుల అణచివేత మొదలు పెట్టింది. ఇప్పటికే ఆడపిల్లల చదువుపై ఆంక్షలు విధించిన తాలిబాన్లు.. మగవాళ్ల హెయిర్ స్టైల్, గడ్డాలపైనా కొత్త నిబంధనలు పెట్టింది. అఫ్గాన్‌లోని హెల్మాండ్ ప్రావిన్స్‌లోని బార్బర్లకు ఇస్లామిక్ ఓరియంటేషన్ మినిస్ట్రీ కొన్ని ఆదేశాలను జారీ చేసింది. గడ్డాలు షేవింగ్ చేయకూడదని, స్టైలిష్ హెయిర్ కట్ చేయకూడదని హుకుం జారీ చేసిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అండర్ కవర్ తాలిబాన్లతో నిఘా
ఇస్లామిక్ ఓరియంటేషన్ మినిస్ట్రీ అధికారులు హెల్మాండ్ ప్రావిన్స్ రాజధాని లష్కర్ గాహ్‌లోని హెయిర్ సెలూన్ ప్రతినిధులతో సమావేశమయ్యారని, మగవాళ్ల హెయిర్ స్టైలింగ్‌పై విధిస్తున్న ఆంక్షల గురించి ఆదేశాల జారీ చేశారని ది ఫ్రాంటియర్ పోస్ట్ పత్రికలో పబ్లిష్ అయింది. అంతేకాదు.. సెలూన్లలో మ్యూజిక్ కూడా ప్లే చేయొద్దని ఆదేశించారని అందులో పేర్కొంది. తాము విధించిన ఆంక్షలను పాటించకుంటే బార్బర్లకు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారని తెలిపింది. దీనిపై నిఘా పెట్టేందుకు అండర్ కవర్ తాలిబాన్ ఫైటర్లు సెలూన్లకు వెళ్లి పరిశీలించి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ప్రణాళిక సిద్దం చేసినట్లు ఆ కథనంలో వెల్లడించింది.