అఫ్గానిస్తాన్ లో మళ్లీ తాలిబన్ల రాజ్యమే

అఫ్గానిస్తాన్ లో మళ్లీ తాలిబన్ల రాజ్యమే


సెంట్రల్​ డెస్క్​, వెలుగుఅఫ్గానిస్తాన్​​ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. 20 ఏండ్లపాటు సప్పుడు లేకుండా ఉన్న తాలిబన్లు.. ఇప్పుడు ఉన్నట్టుండి పట్టుబిగించారు. రోజుల వ్యవధిలోనే దేశంలోని 85% జిల్లాలను ఆక్రమించేశారు. తాలిబన్లతో శాంతి ఒప్పందం తర్వాత అమెరికా పెద్దదిక్కుగా ఉన్న నాటో(నార్త్​ అట్లాంటిక్​ ట్రీటీ ఆర్గనైజేషన్​) బలగాలు వెనక్కు వెళ్లిపోతుండడంతో తాలిబన్​ రాజ్యం చెలామణీలోకి వచ్చింది. దేశంలో మొత్తం 398 జిల్లాలుంటే అందులో 193 జిల్లాల్లో తాలిబన్లు జెండా పాతారు. మరో 130 జిల్లాలు అఫ్గాన్​ సైనికులు, తాలిబన్ల మధ్య నలిగిపోతున్నాయి. మిగిలిన 75 జిల్లాలే ప్రస్తుతం ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. తాజాగా కాందహార్​నూ చేజిక్కించుకున్న తాలిబన్లు.. 70% సరిహద్దుల్లో మోహరించాయి. తమ అధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లోనూ తాలిబన్​ చట్టాలను అమలు చేస్తున్నారు. 

పెంచి పోషించిందే పెద్దన్న

కోల్డ్​ వార్(ప్రచ్ఛన్న యుద్ధం) సమయంలో సోవియట్​ యూనియన్​ను విడగొట్టేందుకు అఫ్గానిస్తాన్​లోకి అమెరికా ఎంటరైంది. తాలిబన్లతో చేతులు కలిపి పవర్స్​ ఇచ్చింది. స్టింగర్​ మిసైల్స్​ వంటి శక్తిమంతమైన ఆయుధాలను వారి చేతుల్లో పెట్టింది. సోవియట్​ యూనియన్​పైకి ఎగదోసింది. తర్వాత 1991లో సోవియట్ యూనియన్..​ రష్యా సహా 15 దేశాలుగా విడిపోయింది. అక్కడికి అమెరికా ఎజెండా పక్కాగానే పనిచేసింది. కానీ, 2001 సెప్టెంబర్​ 11(9/11)న వరల్డ్​ ట్రేడ్​ సెంటర్​ (డబ్ల్యూటీసీ)పై అల్​ఖైదా చేసిన విమాన దాడులు అమెరికా ఆలోచనను పూర్తిగా మార్చేశాయి. ఆ టైంలో అల్​ఖైదా చీఫ్​ ఒసామా బిన్​ లాడెన్​ అఫ్గానిస్తాన్​లోనే ఉండడంతో.. అతడిని చంపేందుకు నాటో బలగాలను పంపించింది. అది కాస్తా తాలిబన్లతో గొడవలాగా మారిపోయింది. వాళ్ల ఆగడాలతో అట్టుడికిపోయిన అఫ్గానిస్తాన్​లో శాంతి తెచ్చేందుకు, అక్కడ నిలకడగా ఉండి పనిచేసేందుకు దాదాపు 2 లక్షల కోట్ల డాలర్లను (సుమారు రూ.150 లక్షల కోట్లు) ఖర్చు పెట్టింది. లాడెన్​ను అంతం చేయగలిగింది. అయితే, ఇటీవలే దోహాలో తాలిబన్లతో అమెరికా శాంతి ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్​ నాటికి తాము వెళ్లిపోతామని, బలగాలను వెనక్కు రప్పిస్తామని ఒప్పందంలో చెప్పింది. అయితే, అల్​ఖైదా సహా ఏ టెర్రరిస్ట్​ సంస్థలతోనూ చేతులు కలపొద్దని తాలిబన్లకు షరతు పెట్టింది. ఈ క్రమంలోనే మే 1 నుంచి బలగాలను నాటో కూటమి వెనక్కు రప్పిస్తోంది. 

ఆగడాలు మొదలు

తమ కంట్రోల్లోని ప్రాంతాల్లో తాలిబన్ల ఆగడాలు ఇప్పటికే మితిమీరిపోయాయి. అమెరికాతో కలిసి పనిచేసిన అఫ్గాన్​ సైనికులే టార్గెట్​గా దాడులు చేస్తున్నారు. వందలాది సైనిక వాహనాలను ఇప్పటికే నాశనంచేశారు. ఏడుగురు పైలట్లను చంపేశారు. దీనిపై అఫ్గానిస్తాన్​ ప్రభుత్వం మాత్రం అధికారిక ప్రకటన చేయలే. ఇటీవల అఫ్గాన్​ ఎయిర్​ఫోర్స్​ మేజర్​ దస్తగిర్​ జమారేను తాలిబన్లు కాల్చి చంపేశారు. 41 ఏండ్ల ఆయన కాబూల్​ నుంచి వేరే చోటుకు వెళ్లిపోదామనుకున్నారు. తన ఇంటిని అమ్మేందుకు ఓ రియల్​ ఎస్టేట్​ ఏజెంట్​ దగ్గరకు వెళ్లగా.. అక్కడకు చేరుకున్న తాలిబన్​ మూకలు జమారేను కాల్చి చంపారు. దీంతో చాలామంది సైనికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. దాదాపు వెయ్యి మంది దాకా సైనికులు దగ్గర్లోని తజకిస్థాన్​ పారిపోయినట్టు చెబుతున్నారు. చాలా మంది విద్యావేత్తలూ దేశం విడిచి వెళ్లిపోతున్నట్టు తెలుస్తోంది. ఇటు చాలా దేశాలూ తమ తమ కాన్సులేట్లను మూసేస్తున్నాయి. మరోవైపు సెప్టెంబర్​లోగా అన్ని దేశాల బలగాలు వెళ్లిపోవాలని, లేదంటే చొరబాటుదారులుగా చూడాల్సి వస్తుందని, తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తాలిబన్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 

ఇండియాకు సవాలే

అఫ్గాన్​పై తాలిబన్లు పట్టుబిగించడమంటే ఇండియాకు ముప్పేనంటున్నారు నిపుణులు. పైగా చైనా తమకు దోస్తేనని తాలిబన్లు ప్రకటించడం ఇంకాపెద్ద ప్రమాదమని చెప్తున్నారు.  

టెర్రరిజం: తాలిబన్లతో ఇండియాకు పొంచి ఉన్న ముప్పు టెర్రరిజం. ఇప్పటికే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్​కు తాలిబన్లతో మరింత లాభం కలిగే పరిస్థితులొస్తాయని అంటున్నారు. జమ్మూకాశ్మీర్​లో టెర్రరిజాన్ని మరింతగా బలపరిచేందుకు పాక్​.. తాలిబన్ల సాయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఘాంజీ, ఖోస్త్​, లోగార్​, పాక్తియా, పాక్తికా ప్రావిన్స్​లలో దాదాపు 7,200 మంది దాకా లష్కరే టెర్రరిస్టులున్నట్టు చెబుతున్నారు. అందులో సూసైడ్​ బాంబర్లూ ఉన్నారంటున్నారు. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్​లో టెర్రరిజం పెరిగిపోకుండా మన ప్రభుత్వం ముందే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 
పెట్టుబడులు: అఫ్గానిస్తాన్​ అభివృద్ధి కోసం ఇప్పటికే అక్కడ మన దేశం దాదాపు రూ.2,200 కోట్ల పెట్టుబడులు పెట్టింది. రూ.600 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను నిరుడు ప్రకటించింది. ఇప్పుడు ఆ పెట్టుబడులపై ప్రభావం పడే ముప్పుంది. 

చైనా ముప్పు:  చైనా, పాక్​ సహా చాలా దేశాలూ అఫ్గాన్​పై ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తున్నాయి. కారణం, వివిధ దేశాలతో ఆ దేశానికున్న వ్యూహాత్మక సరిహద్దులు, ఆ దేశ జియోగ్రాఫికల్ (భౌగోళిక) స్వరూపమే. ఆసియాలో ట్రేడ్​ రూట్​కు ఆ దేశమే కీలకం. దీన్ని పసిగట్టిన చైనా.. తాను అభివృద్ధి చేస్తున్న ‘వన్​ బెల్ట్​ వన్​ రోడ్​’ ప్లాన్​లో పాకిస్తాన్​తో పాటు అఫ్గాన్​నూ చేర్చింది. చైనా అండ ఉన్న ఈ పరిస్థితుల్లో తాలిబన్లను ఆపడం ఇండియాకు సవాల్​తో కూడుకున్నదే. 

ఇక మాకు సంబంధం లేదు: బైడెన్​

బలగాల వాపసీని అమెరికా ప్రెసిడెంట్​జో బైడెన్​ సమర్థించుకున్నారు. అమెరికా ఇక ఎంతమాత్రమూ అక్కడి యుద్ధంలో భాగం కాబోదని తేల్చి చెప్పారు. సైన్యాన్ని అక్కడే ఉంచాలన్న వాదనను ఆయన తప్పుబట్టారు. ఇంకెంతమంది అమెరికన్లను ప్రమాదంలోకి నెట్టాలని ప్రశ్నించారు. అఫ్గాన్​ భవిష్యత్తు ఇక ఏమాత్రం అమెరికా సైన్యంచేతుల్లో ఉండదన్నారు. అక్కడి ప్రభుత్వం, మహిళలు, పిల్లల హక్కులతో సంబంధం లేదన్నారు. 

చైనా మాకు దోస్తే..తాలిబన్ల ప్రకటన

చైనా తమకు దోస్త్​ అని తాలిబన్లు ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం తో చితికిపోయిన అఫ్గానిస్తాన్​ను తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు చైనా పెట్టుబడులు పెడితే తాము అండగా ఉంటామని తాలిబన్​ ప్రతినిధి సుహైల్​ షాహీన్​ అన్నాడు. చైనా పెట్టుబడిదారులకు తాము రక్షణ కల్పిస్తామన్నాడు. షిన్జియాంగ్​లోని వీగర్​ ముస్లింలకూ ఆశ్రయం ఇవ్వబోమన్నాడు. ఈస్ట్​ తుర్కిస్తాన్​ ఇస్లామిక్​ మూవ్​మెంట్​ పెరిగిపోతుందన్న చైనా వ్యాఖ్యలతో తాలిబన్లు ఈ ప్రకటన చేయ డం గమనార్హం. తాము చాలాసార్లు చైనాకు వెళ్లామని, వారితో మంచి సంబంధాలే ఉన్నాయని షాహీన్​ చెప్పుకొచ్చాడు. మరోవైపు అఫ్గానిస్తాన్​లో శాంతి నెలకొనేందుకు ప్రయత్నాలు చేస్తామని పాకిస్తాన్​ చెబుతోంది. 

కాందహార్​ నుంచి మన డిప్లొమాట్లు వాపస్​.

న్యూఢిల్లీ: తాలిబన్లు కాందహార్​నూ చేజిక్కించుకోవడంతో అక్కడున్న మన 50 మంది డిప్లొమాట్లను కేంద్రం వెనక్కు తీసుకొచ్చింది. సిబ్బంది భద్రత, రక్షణే తమకు ముఖ్యమని విదేశాంగ ప్రతినిధి అరిందమ్​ బాగ్చీ చెప్పారు. అయితే, కాందహార్​లోని కాన్సులేట్​ జనరల్​ను మాత్రం మూసేయలేదన్నారు. పరిస్థితులు చక్కబడ్డాక అధికారులను పంపిస్తామన్నా రు. ఇండియన్ల ను కిడ్నాప్​ చేసే ప్రమాదముందని, అఫ్గాన్​లో ఉద్యోగం చేసేవారు జాగ్రత్త గా ఉండాలని సూచించింది. కాగా, అధికారులను వెనక్కు తీసుకొచ్చిన ఎయిర్​ఫోర్స్​ స్పెషల్​ విమానం.. పాకిస్తాన్​ ఎయిర్​స్పేస్​ను వాడుకోలేదని విదేశాంగ శాఖ తెలిపింది.