కాబూల్: అఫ్గానిస్థాన్‌ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబాన్లు అంటే ప్రజల్లో భయాందోళనలు ఎక్కువవతున్నాయి. ఇప్పటికే చదువుకోకూడదని మహిళా హక్కులపై ఉక్కుపాదం మోపిన తాలిబాన్లు.. సాధారణ ప్రజల స్వేచ్ఛను కూడా హరిస్తున్నారు. ఐపీఎల్ జరుగుతున్న స్టేడియాల్లో లేడీ ఫ్యాన్స్ ఉన్నారని ఆ టోర్నీ ప్రసారాలపై నిషేధం విధించారు. ఎవరైనా తప్పు చేస్తే కాళ్లు, చేతులు నరికేసే శిక్షలను అమలు చేస్తామని తాలిబాన్ ఫౌండర్లలో ఒకరైన ముల్లా నూరుద్దీన్ తురాబీ అనడం సంచలనం రేపింది.
తాజాగా తాఖిర్ ప్రావిన్స్‌లో ఓ బాలుడ్ని తాలిబాన్లు చంపిన ఘటన వారి కిరాతక పాలనకు అద్దం పడుతోంది. తాలిబాన్లపై పోరాడుతున్న రెసిస్టెన్స్ ఫోర్స్‌లో పని చేస్తున్న వ్యక్తి కుమారుడనే కారణంతో ఆ పిల్లాడ్ని తాలిబాన్లు కిరాతకంగా చంపారు. రక్తపు మడుగులో ఆ పిల్లాడు పడి ఉన్న వీడియోను లోకల్ మీడియా షేర్ చేయడంతో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. పిల్లాడి పక్కన మరో ముగ్గురు చిన్నారులు ఏడుస్తున్న వీడియో అందర్నీ కలచి వేస్తోంది.