- తాలిబాన్ హోం మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ కామెంట్లు
- ఇస్లాం కోసం ప్రాణ త్యాగం చేస్తున్నారని ప్రశంసలు
- వారి కుటుంబాలకు డబ్బు సాయం
కాబూల్/మాస్కో: టెర్రరిస్టులకు అడ్డాగా మారిన తాలిబాన్ ప్రభుత్వం మరో నిర్వాకానికి తెరలేపింది. మసీదులు, పబ్లిక్‌ప్లేసుల్లో బాంబులు పేల్చి జనాల ప్రాణాలు తీసిన సూసైడ్ బాంబర్లను అమరులంటూ పొగడ్తలు కురిపించింది. అంతేకాదు.. వారి కుటుంబాలకు ఆర్థిక సాయాన్నీ అందజేస్తామని తలపై కోటి డాలర్ల రివార్డున్న గ్లోబల్ టెర్రరిస్ట్, హక్కానీ నెట్వర్క్ చీఫ్, తాలిబాన్ హోం మంత్రి అయిన సిరాజుద్దీన్ హక్కానీ ప్రకటించాడు. కాబూల్‌లోని ఇంటర్కాంటినెంటల్ హోటల్లో అతడు సూసైడ్ బాంబర్ల కుటుంబాలతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఇస్లాం కోసం ప్రాణ త్యాగం చేస్తున్న సూసైడ్ బాంబర్లంతా హీరోలని, అమరులని, జిహాద్లో వారిది అసలైన త్యాగమని కొనియాడాడు. ఈ సందర్భంగా ఒక్కో సూసైడ్ బాంబర్ కుటుంబానికి 10 వేల అఫ్గానీలు (111 డాలర్లు), బట్టలను ఇచ్చారు. వారికి భూమి కూడా ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారని తాలిబాన్ ప్రతినిధి ఖారీ సయీద్ ఖోస్తీ చెప్పాడు.
మహిళా వాలీబాల్ ప్లేయర్ తల నరికిన్రు..
అఫ్గాన్ జూనియర్ విమెన్స్ నేషనల్ వాలీబాల్టీమ్లోని ఓ మహిళా ప్లేయర్ తలను తాలిబాన్లు నరికేశారు. ఓ కోచ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మాజాబిన్ హకీమీ అనే అమ్మాయిని ఈ నెల ప్రారంభంలో చంపేశారని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ కుటుంబ సభ్యులను బెదిరించారని, దీంతో ఆ విషయం బయటకు రాలేదన్నారు. కేవలం ఇద్దరు యువ ప్లేయర్లే దేశం నుంచి తప్పించుకుని వెళ్లగలిగారని చెప్పారు. మిగతా వాళ్లంతాఎప్పుడేం జరుగుతుందోనని భయంభయంగా ఉంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాలిబాన్లు అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి ముందు హకీమీ.. కాబూల్ మున్సిపాలిటీ వాలీబాల్ క్లబ్తరఫున ఆడింది.
తాలిబాన్లతో రష్యా చర్చలు
అఫ్గానిస్తాన్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే ప్రభుత్వం కావాలని రష్యా అభిప్రాయపడింది. బుధవారం మాస్కోలో తాలిబాన్ ప్రతినిధులతో రష్యా విదేశాంగ మంత్రి సెర్జె లావ్రోవ్ చర్చలు జరిపారు. అఫ్గాన్‌లో ప్రస్తుతం శాంతిని నెలకొల్పడం చాలా అవసరమని సూచించారు. దేశంలో ప్రస్తుతమున్న టెన్షన్ వాతావరణాన్ని చల్లబరిచేందుకు తాలిబాన్లు కృషి చేస్తున్నారని ఆయన మెచ్చుకోవడం కొసమెరుపు.