
- ప్రపంచ దేశాలకు తాలిబాన్ల వార్నింగ్
- ఆయా దేశాల్లో ఫ్రీజైన డబ్బులూ రిలీజ్ చేయాలని డిమాండ్
కాబుల్: తమ పాలనను అధికారికంగా గుర్తించాలని అమెరికా సహా మిగతా దేశాలను తాలిబాన్లు శనివారం కోరారు. అలాగే వివిధ దేశాల్లో ఫ్రీజ్ చేసిన నిధులను విడుదల చేయాలన్నారు. ఇది జరగకపోతే అఫ్గానిస్తాన్‌తో పాటు ఇతర దేశాలు ఇబ్బంది పడాల్సి వస్తుందని తాలిబాన్ స్పోక్స్‌పర్సన్ జబీనుల్లా ముజాహిద్ అన్నారు. అమెరికా, అఫ్గాన్మధ్య సరైన సంబంధాలు లేకపోవడం వల్లే రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చిందన్నారు. చర్చల వల్ల ఆ సమస్యను పరిష్కరించుకొని ఉండే వాళ్లమని చెప్పారు. అఫ్గాన్‌లో తాలిబాన్లు సర్కారును ఏర్పాటు చేశాక ఏ దేశమూ ఆ సర్కారును గుర్తించలేదు. పైగా ఆయా దేశాల్లోని అఫ్గాన్ నిధులను ఫ్రీజ్ చేశాయి.
తొలిసారి ప్రజల మధ్యకు హైబతుల్లా
అఫ్గానిస్తాన్ లో తాలిబాన్ల రాజ్యం ఏర్పడిన 2 నెలల తర్వాత తాలిబాన్ల చీఫ్ హైబతుల్లా అఖుంద్జాదా తొలిసారి ప్రజల మధ్యకు వచ్చారు. కాందహార్‌లో సపోర్టర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారని తాలిబాన్ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. అఫ్గాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు ఆయన బయటకు రాకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆయన చనిపోయారని వార్తలు ప్రచారమయ్యాయి. ఈ నేపథ్యంలో హైబతుల్లా తొలిసారి ప్రజల మధ్యకు వచ్చారు. కాందహార్‌లోని దారుల్ఉలూమ్హకిమత్ మదర్సాను శనివారం ఆయన సందర్శించారని.. అక్కడ సోల్జర్లు, అనుచరులతో మాట్లాడారని తాలిబాన్ వర్గాలు చెప్పాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన ఆ ప్రాంతానికి చేరుకున్నారని తెలిపాయి. అయితే ఆయనకు సంబంధించిన ఫొటోలు గాని, వీడియో గాని బయటకు రాలేదు. ఆయన ప్రసంగంలోని 10 నిమిషాల ఆడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.