
మంచిర్యాల, వెలుగు: బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 'ఎర్ర గులాబీ' మొగ్గ తొడుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, వామపక్షాల మధ్య పొత్తు ఖాయమన్న వార్తల నేపథ్యంలో ఈ సీటుపై సీపీఐ కన్నేసింది. ఆ పార్టీ గతంలో ఈ ప్రాంతం నుంచి ఎనిమిదిసార్లు పోటీ చేసి నాలుగుసార్లు గెలిచింది. దివంగత నేత గుండా మల్లేశ్ పాత ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు, బెల్లంపల్లి నుంచి మరోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, వామపక్షాల మధ్య పొత్తు కుదిరితే బెల్లంపల్లి సీటు కోసం సీపీఐ గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ప్రజా వ్యతిరేకతకు తోడు టీఆర్ఎస్ సర్వేల్లో కూడా నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో పొత్తులో భాగంగా బెల్లంపల్లిని సీపీఐకి కేటాయించే అవకాశాలు ఉన్నాయని రూలింగ్ పార్టీలోనూ చర్చ జరుగుతోంది.
గతంలోనూ సీపీఐకే...
2009లో బెల్లంపల్లి నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు బెల్లంపల్లి ప్రాంతం ఆసిఫాబాద్ నియోజవకర్గంలో ఉండేది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేశాయి. ఆసిఫాబాద్ స్థానాన్ని సీపీఐ కేటాయించారు. 2009లో టీడీపీ, లెఫ్ట్ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. బెల్లంపల్లి సీటును సీపీఐకి ఇవ్వగా గుండా మల్లేశ్ గెలిచారు. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలు నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తులో భాగంగా ఈ సీటు సీపీఐకే దక్కింది. వామపక్షాలు ఏ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా బెల్లంపల్లి అసెంబ్లీ స్థానాన్ని సీపీఐకి కేటాయించడం ఆనవాయితీగా మారింది.
కామ్రేడ్లలో ధీమా...
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య 'పొత్తు' పొడిచినట్లయితే గత ఆనవాయితీ పునరావృతం అవుతుందని కామ్రేడ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలకు రాష్ట్రవ్యాప్తంగా రెండు లోక్‌సభ స్థానాలతో పాటు సుమారు పది అసెంబ్లీ సీట్లను కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బెల్లంపల్లి ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ కావడంతో సీపీఐ కచ్చితంగా ఈ స్థానం కోసం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే... గతంలో ఈ ప్రాంతం నుంచి ఎనిమిదిసార్లు పోటీ చేసి నాలుగుసార్లు గెలిచిన చరిత్ర ఆ పార్టీకి ఉంది. అలాగే నియోజకవర్గంలో ముఖ్యమైన బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్ మండలాలు సింగరేణి ప్రభావిత ప్రాంతాలు కావడంతో వామపక్ష భావజాలం ఎక్కువ. బొగ్గుబాయి కార్మికులు, రిటైర్డ్ కార్మికులకు సీపీఐ, ఏఐటీయూసీతో అనుబంధం ఉంది. ఈమేరకు సీపీఐ రాష్ట్ర సమితి నుంచి కూడా సంకేతాలు రావడంతో ఆ పార్టీ జిల్లా నాయకత్వం బెల్లంపల్లిపై ఫోకస్ పెంచింది. నస్పూర్ మున్సిపల్ కౌన్సిలర్ రేగుంట చంద్రశేఖర్ ఇటీవల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్ లీడర్లతో టచ్‌లో ఉంటున్నారు.
బీఆర్ఎస్లోనూ అదే చర్చ...
2014, 2018 ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా దుర్గం చిన్నయ్య గెలుపొందారు. అంతకుముందు ఆయన టీడీపీలో కొనసాగుతూ ఎంపీపీగా, జడ్పీటీసీగా పనిచేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటి ఉంటూ ఉద్యమనేతగా గుర్తింపు పొందిన రేణికుంట్ల ప్రవీణ్ చిన్నయ్యకు పోటీగా తయారయ్యారు. కిందటి ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ టికెట్‌కోసం గట్టిగా ఫైట్‌చేసి ఫెయిలయ్యారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అండతో ఈసారి టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఎంపీ వెంకటేశ్ నేత కూడా ఈసారి బెల్లంపల్లి అసెంబ్లీ స్థానంపై కన్నేశారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు చిన్నయ్య పనితీరుపై ఇటు ప్రజల్లో, అటు పార్టీలో అసంతృప్తి కనిపిస్తోంది. పార్టీ సర్వేల్లోనూ ఆయనకు నెగటివ్ రిపోర్ట్ రావడంతో అధిష్టానం దగ్గర పరపతి తగ్గినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పొత్తు కుదిరితే బెల్లంపల్లి సీటును సీపీఐకి కేటాయించే చాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.