టీమిండియాకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి స్టార్ బౌలర్..!

టీమిండియా అభిమానులకు భారీ గుడ్ న్యూస్. ఆస్ట్రేలియా టూర్‎లో గాయపడ్డ భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారులు నిర్ధారించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ బుమ్రాను ఎంపిక చేసిందని.. దీనిపై శనివారం (జనవరి 18) అధికారిక ప్రకటన వెలువడుతుందని నేషనల్ మీడియా పేర్కొంది. చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసినప్పటికీ బుమ్రా లీగ్‎లో ఆడతాడా లేదా అనేది మాత్రం అతడి ఫిట్‎నెస్‎పైనే ఆధారపడి ఉంటుందని సమాచారం. 

ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే భారత జట్టును 2025, జనవరి 18న బీసీసీఐ ప్రకటించనుంది. సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ఈ మెగా టోర్నీకి15 మంది సభ్యులతో కూడిన జట్టును శనివారం అనౌన్స్ చేయనున్నారు. ట్రోఫీ గెలుపే లక్ష్యంగా అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకుని జట్టును సెలెక్ట్ చేసినట్లు బీసీసీఐ పేర్కొంది. సీనియారిటీని పరిగణలోకి తీసుకుని ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‎ను చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసినట్లు టాక్.

Also Read : బీసీసీఐ నిబంధనలపై హర్భజన్ సింగ్ ఫైర్

గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తోన్న సంజు శాంసన్, దేశవాళీ టోర్నీల్లో సెంచరీల మోత మోగిస్తోన్న కరుణ్ నాయర్‎కు మరోసారి నిరాశే మిగిలే అవకాశం ఉంది. చాంపియన్స్ ట్రోఫీకి ఈ ఇద్దరు బ్యాటర్లకు బీసీసీఐ మొండిచేయి చూపించినట్లు తెలిసింది. విజయ్ హాజరే ట్రోఫిలో ఏమంతంగా రాణించకపోవడంతో యువ బ్యాటర్ సంజు శాంసన్‎ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. 

దేశవాళీ టోర్నీల్లో పరుగుల వరద పారిస్తున్నప్పటికీ.. వయస్సు, చివరగా జాతీయ జట్టుకు ఆడిన అంశాలను పరిగణలోకి తీసుకుని కరుణ్ నాయర్‎ను కూడా పక్కకి పెట్టినట్లు టాక్. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఓటమి తర్వాత భారత జట్టుపై పెరుగుతున్న ఒత్తిడి, డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలను దృష్టిలోని పెట్టుకుని సెలక్షన్ కమిటీ జట్టు కూర్పు విషయంలో తీవ్ర కసరత్తు చేసినట్లు తెలిసింది. కాగా, 2025 ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు పాకిస్తాన్, యూఏఈలోని మూడు వేదికలలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. మొత్తం 8 జట్లు పోటీ పడే ఈ మెగా టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరెట్‎గా బరిలోకి దిగుతోంది.