
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మధ్య చర్చలు హాట్ హాట్‌గా సాగాయి. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోని ఓవల్ఆఫీసులో శుక్రవారం (ఫిబ్రవరి 28) ఇరు దేశాధినేతలు ఉక్రెయిన్‌లో మినరల్ తవ్వకాల ఒప్పందం, రష్యాతో శాంతి ఒప్పందం అజెండాగా భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశం అనుకున్నంత సజావుగా సాగలేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలకు జెలెన్ స్కీ నిరాకరించడంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం నడిచింది. ట్రంప్, జెలెన్ స్కీ మీడియా ముందే వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఆగ్రహానికి గురైన ట్రంప్.. జెలెన్ స్కీ తీరుపై నిప్పులు చెరిగారు.
‘నువ్వు చాలా పెద్ద సమస్యలో ఉన్నావు. రష్యాతో యుద్ధం నువ్వు గెలువలేవు. శాంతి ఒప్పందం, కాల్పుల విరమణకు అంగీకరించకుండా లక్షలాది మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నావ్. మూడో ప్రపంచ యుద్ధంతో జూదమాడుతున్నావు. అమెరికా దేశానికి అవమానకరంగా మాట్లాడుతున్నావ్. మేం మీకు 350 బిలియన్ డాలర్లు ఇచ్చాం. సైనిక సామగ్రి, ఆయుధాలు సమకూర్చాం. అందుకే ఇన్నాళ్లు పోరాడారు. మేం కనుక ఈ సాయం చేయకుంటే, అమెరికా ఆయుధాలు లేకుంటే యుద్ధం కేవలం రెండు వారాల్లో ముగిసిపోయి ఉండేది’ అంటూ ట్రంప్ ఆగ్రహం వెల్లగక్కారు.
ట్రంప్ వ్యాఖ్యలతో ప్రపంచ దేశాల్లో భయాందోళనలు:
జెలెన్ స్కీ, ట్రంప్ భేటీ ప్రపంచ దేశాల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఇటీవల రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి యూఎన్‌లో జరిగిన ఓటింగ్‌లో కూడా ఎవరూ ఊహించని విధంగా అమెరికా రష్యా పక్షాన నిలబడింది. ఇదిలా ఉండగానే.. తాజాగా జరిగిన భేటీలో కూడా జెలెన్ స్కీపై ట్రంప్ తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. కాల్పుల విరమణకు అంగీకరించాలని.. లేదంటే ఇక మాకు సంబంధం లేదని తెగేసి చెప్పాడు ట్రంప్. కాల్పుల విరణమకు అంగీకరిస్తాం.. కానీ భవిష్యత్తులో తమపై దాడులు జరగవనే భరోసా కల్పించాలని జెలెన్ స్కీ ఓ వైపు మొత్తుకుంటున్నా.. ట్రంప్ ఏ మాత్రం పట్టించుకోకుండా ఫస్ట్ కాల్పులు విరమణకు అంగీకరించాలని ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేశాడు.
నువ్వు మూడో ప్రపంచయుద్ధంతో జుదామాడుతున్నావ్ అంటూ ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చివరకు తాజా చర్చలు విఫలం కావడంతో అమెరికా నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ‘ఇక మేకు మేం మద్దతు తెలపం.. మీది మీరు చూసుకోండి’ అన్న ట్రంప్ అన్నంతా పని చేస్తారా..? ట్రంప్ కనుక అలా చేస్తే మూడవ ప్రపంచ యుద్ధం తప్పదా..? అన్న చర్చలు ఊపందుకున్నాయి. ఒకవేళ ట్రంప్ ఉక్రెయిన్‌కు మద్దతు ఉపసంహరించుకుంటే.. రష్యా మరింత చెలరేగే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాలు మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయని ప్రపంచ దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ట్రంప్, జెలెన్ స్కీ మధ్య జరిగిన వాడీ వేడి చర్చలు చివరకు ఏ పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి మరీ.