
= అనర్హత వేటు తప్పించుకోనున్న గులాబీ బాస్
= జగన్ తరహాలోనే బడ్జెట్ రోజు అసెంబ్లీకి కేసీఆర్
= 60 పనిదినాల వరకు ఇక వెళ్లాల్సిన పనిలేదు
= గత బడ్జెట్ సెషన్ తర్వాత కనిపించిన మాజీ సీఎం
= మళ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే వస్తారంటున్న పలువురు
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ తరహాలో ఫార్ములాను అవలంబిస్తారనే చర్చ సాగుతోంది. అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే కనీసం 60 పని దినాల్లో ఒక్క రోజైనా సభకు హాజరుకావాలనే నిబంధన ఉంది. జగన్ తరహాలో ఆయన కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక్క రోజే అసెంబ్లీకి హాజరు కావాలని భావిస్తున్నారని తెలుస్తోంది. గత ఏడాది కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు వచ్చి కాసేపు ఉండి.. వెంటనే బయటికి వచ్చి మీడియా పాయింట్ వద్ద బడ్జెట్ గురించి నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోయారు.
ప్రస్తుతం కూడా బడ్జెట్ సెషన్‌కు హాజరై వెళ్లిపోతారని తెలుస్తోంది. ఇటీవలే పాస్ పోర్టును మార్చుకున్న కేసీఆర్ దంపతులు త్వరలోనే విదేశాలకు వెళ్లే యోచనలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడాన్ని అధికార కాంగ్రెస్ చాలా రోజులుగా తప్పు పడుతూ వస్తోంది. ముఖ్యమంత్రి సహా మంత్రులంతా విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ అపారమైన అనుభవంతో తమకు మార్గనిర్దేశనం చేయాలంటూ సీఎం రేవంత్ పలుమార్లు అసెంబ్లీ వేదికగానే పేర్కొన్నారు. అయినా కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు.
ఎమ్మెల్సీ పదవి ఎవరికి..?
ఈ నెల 12 నుంచి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ముఖ్యనేతలతో భేటీ అయ్యారు గులాబీ బాస్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఆయన చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీ వరకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్లకు గడువు ఉండటంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేశారని సమాచారం. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్కు ఒక్క ఎమ్మెల్సీ వస్తుంది. పాత వారికి రెన్యూవల్ చేస్తారా..? లేక కొత్త వారికి ఇస్తారా..? అనే సస్పెన్స్ కొనసాగుతుంది.