యువ ఎంపీలు మాటకారులే!

కొత్తగా చట్టసభల్లో అడుగుపెట్టినవాళ్లు తడబడడం, విషయ అవగాహన లేకుండా సమయాన్ని వేస్ట్​ చేయడం పరిపాటి.  17వ లోక్​సభ తొలి సమావేశాల్లో మాత్రం మీనింగ్​ ఫుల్​ డిస్కషన్స్​ జరిగాయి. మోడీ సర్కారు ప్రవేశపెట్టిన కీలక బిల్లులపై యువ ఎంపీలు చురుగ్గా పాల్గొన్నారు. అడ్డగోలుగా మాట్లాడుతూ షౌటింగ్​ బ్రిగేడ్​లా వ్యవహరించకుండా దేశమంతా ఆలోచించేరీతిలో ప్రసంగించారు. ఇక,  సభకు వెలుపల ఉన్న ప్రతిపక్ష యువ నాయకుల్లోనూ పాజిటివ్​ థింకింగ్​ రావడం మెచ్చుకోవలసిన విషయమే.

ఈ సారి లోక్​సభలో యువ గొంతులు బాగా వినపడ్డాయి. కేంద్రం ప్రవేశపెట్టిన అనేక బిల్లులపై తమ తమ పార్టీల ఐడియాలజీకి వ్యతిరేకంగాకూడా స్వరం వినిపించారు.  మొత్తం లోక్​సభ ఎంపీల్లో కొత్తగా ఎన్నికైనవారిలో 64 మంది వయసు 40 ఏళ్లలోపే. మరో 221 మంది వయసు 41 నుంచి 55 ఏళ్ల మధ్యలో ఉంది. వీరంతా పాతకాలపు రాజకీయాలతో నిమిత్తం లేకుండా కొత్త తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు  పార్లమెంట్​ వెలుపల కూడా ఇదే ధోరణి కనిపించింది. ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు తమ తమ ట్వీట్లలో కేంద్రం తీసుకొచ్చిన బిల్లులకు మద్దతు ప్రకటించడం ఊహించని విషయం.

లోక్​సభలో ప్రపంగించిన యువ ఎంపీల్లో నలుగురైదుగురు మొత్తం దేశం దృష్టిని ఆకర్షించారు. ట్రిపుల్​ తలాక్​ బిల్లు, ఆర్టికల్​ 370 రద్దు బిల్లు వంటివి ఈసారి పార్లమెంట్​ సమావేశాలను కుదిపేశాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాలను గట్టిగా సమర్థిస్తూ సీనియర్​ ప్రతిపక్ష నాయకులనుసైతం యువ ఎంపీలు నిలదీశారు. అలాంటివారిలో ముఖ్యులు బీజేపీ నుంచి పూనమ్​ మహాజన్​, సేరింగ్​ నాం​గ్యల్​, ఎన్డీయే మిత్రపక్షం అప్నాదళ్​ (సోనేవాల్​) సభ్యురాలు అనుప్రియ సింగ్​ పటేల్​, ఇండిపెండెంట్​ ఎంపీ నవనీత్​ కౌర్​ రవి ఉన్నారు.

సీనియర్లకు మాట బంద్​

లఢఖ్​ నుంచి గెలిచిన జమ్యంగ్​ సేరింగ్​ నాం​గ్యల్​ సుమారు 20 నిమిషాలపాటు ప్రసంగించగా, దాదాపు 12 నిమిషాలపాటు సభలో చప్పట్టు వినిపించాయి. లఢఖ్​కి ప్రత్యేక యూనియన్​ టెరిటరీ (యూటీ)గా మార్చడాన్ని ఫుల్​గా స్వాగతించారు. ‘లఢఖ్​లో ఏం జరుగుతోందో నాకు తెలుసు. అలాగే, కార్గిల్​ అంటే కేవలం ఒక వీధికో, మార్కెట్టుకో పరిమితమైనది కాదు. అక్కడి సమస్యలను మీరు బుక్కుల్లోనూ, వార్తల్లోనూ తెలుసుకుని ఉంటారు. నేను స్వయంగా చూసినవాణ్ణి’ అని కాంగ్రెస్​ నాయకులను గట్టిగా ఢీకొట్టారు .  33 ఏళ్ల నాం​గ్యల్​ తండ్రి మిలిటరీ ఇంజినీరింగ్​ సర్వీసు (ఎంఈఎస్​)లో పనిచేసి రిటైరయ్యారు. స్టూడెంట్​ రాజకీయాల నుంచి నేషనల్​ పాలిటిక్స్​లోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్​ టైమ్​ డిబేట్​లోనే సత్తా చాటుకున్నారు నాంగ్యల్​.

పూనమ్​ మహాజన్​ అంతకుముందు ట్రిపుల్​ తలాక్​పై జరిగిన చర్చలో ముస్లిం ఎంపీల వాదనను తిప్పికొట్టారు. ‘ఫోన్​లోనో, వాట్సప్​లోనో తలాక్​ చెబితే మీకు ఓకేనా!’ అని సూటిగా ప్రశ్నించి మారుమాటాడకుండా చేశారు. జమ్మూ కాశ్మీర్​ ప్రజల స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేశాకనే ఆర్టికల్​ 370ని రద్దు చేయాలన్న నిర్ణయానికి మోడీ సర్కారు వచ్చిందని, కాబట్టి పాలిటిక్స్​ పక్కనబెట్టి అందరూ మద్దతునివ్వాలని రిక్వెస్ట్​ చేశారు పూనమ్​.బీజేపీ దివంగత నాయకుడు ప్రమోద్​ మహాజన్​ కూతురామె. తండ్రి హత్య తర్వాత ఆమె భారతీయ జనతా యువ మోర్చాలో చేరారు. ముంబై నార్త్​ సెంట్రల్​ నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచారు.

మోడీ సర్కారు–1లో మంత్రిగా పనిచేసిన అప్నాదళ్​ (సోనేవాల్) ఎంపీ అనుప్రియ పటేల్​ జమ్మూ కాశ్మీర్​ బిల్లు ఇంపార్టెన్స్​ని గట్టిగా వినిపించారు. కాశ్మీర్​ సమస్యను పండిట్​ నెహ్రూకి బదులుగా సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ డీల్​ చేసి ఉంటే… ఇప్పటికే కాశ్మీర్​ అభివృద్ధి సాధించేదన్నారు. ‌‌మోడీ సర్కారుపై ఒంటికాలిపై నిలిచే మమతా బెనర్జీ పార్టీ తృణమూల్​ కాంగ్రెస్​:తరఫున గెలిచిన మిమి చక్రవర్తి, నుస్రత్​ జహాన్​, మొహువా మొయిత్ర కేంద్ర నిర్ణయాలను గట్టిగా వ్యతిరేకించకపోవడం పొలిటికల్​ ఎనలిస్టులను ఆశ్చర్యపరిచింది.  17వ లోక్​సభ తొలి బడ్జెట్​ సమావేశాలు పూర్తిగా మోడీ సర్కారు ప్రయారిటీలను ప్రతిబింబించిందన్నది విశ్లేషకుల ఏకాభిప్రాయం. ముఖ్యంగా యువ ఎంపీలు కేవలం షౌటింగ్​ బ్రిగేడ్​లా కాకుండా ఇష్యూ బేస్​డ్​ డిబేట్లలో పాల్గొనడం, స్పీకర్​ ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్లయ్యిందని అంటున్నారు.

ఎమోషనల్​ టచ్​ ఇచ్చిన నవనీత్​

సభలో తొలిసారి అడుగుపెట్టిన ఇండిపెండెంట్​ ఎంపీ, సినీ నటి నవనీత్​ కౌర్​ రవి రాణా జమ్మూకాశ్మీర్​ విషయానికి ఎమోషనల్​ టచ్​ ఇచ్చారు. కేంద్ర నిర్ణయం వెనుక కాశ్మీర్​ మిలిటెంట్ల బలిదానం ఉందన్నారు. కాశ్మీర్​లో షూటింగ్​లకోసం తాము వెళ్లినప్పుడు తమకెదురైన అనుభవాలనుకూడా చెప్పారు. ఇండియా ప్రధాన భూభాగంతో కలవకుండా అక్కడి ప్రజలు అనుభవిస్తున్న ఇబ్బందులను, సమస్యలను సభలో ప్రస్తావించారు. మధ్యలో ఆంధ్రప్రదేశ్​కి చెందిన ఎంపీ ఒకరు కల్పించుకోబోతే… నవనీత్​ తెలుగులోనే బదులిచ్చి, తన ప్రసంగాన్ని కొనసాగించడం ఆమె సమయస్ఫూర్తికి అద్దం పట్టింది. అసలు సభలో ఆమె చేసిన తొలి ప్రసంగమే…. ప్రజా సమస్యలపైనా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అమరావతి స్థానం పరిస్థితిపైనా ఆమెకుగల అవగాహనకు అద్దం పట్టింది. అమరావతి రైతాంగం ఎదుర్కొంటున్న నీటి ఎద్దడిని తొలగించడానికి శాశ్వత పరిష్కారం సూచించమన్నారు. మహారాష్ట్రకు పీఎంవైఏలో జరుగుతున్న అన్యాయంపై మాట్లాడారు. ఇరుగుపొరుగు ఉన్న మధ్యప్రదేశ్​, గుజరాత్​ రాష్ట్రాలకు ఇచ్చిన ఇళ్లకంటే తక్కువగా తమకు మంజూరు చేశారని సభ దృష్టికి తెచ్చారు. నవనీత్​ కౌర్​ సినీనటిగా సుమారు 15 తెలుగు సినిమాల్లో నటించారు. ఆమె భర్త రవి రాణా అమరావతి పరిధిలోని బడ్​నెరా నుంచి ఇండిపెండెంట్​ ఎమ్మెల్యేగా ఉన్నారు.

అదే దారిలో కాంగ్రెస్​ యువత

కాంగ్రెస్​ పార్టీ జమ్మూ కాశ్మీర్​ విషయంలో మునుపటి వైఖరితోనే వ్యతిరేకించడానికి ప్రయత్నించింది. అయితే, రాహుల్​ గాంధీ కోర్​ టీమ్​లో ముఖ్యుడైన జ్యోతిరాదిత్య సింధియా మాత్రం వేరుగా స్పందించారు.  ఆయన ట్విటర్​లో ‘ఇండియాలో సమగ్ర విలీన ప్రతిపాదనకు నేను పూర్తిగా మద్దతునిస్తున్నాను’ అన్నారు. ఇది పాతకాలపు కాంగ్రెస్​వాదులకు రుచించని విషయమనే చెప్పాలి. కాంగ్రెస్​ యువ​ నాయకుల్లో మరో ముఖ్యుడు మిలింద్​ దేవ్​రా చాలా జాగ్రత్తగా ట్వీట్​ చేశారు. సింధియా మాదిరిగా కుండబద్దలు కొట్టకుండా… ‘కాశ్మీరీ యువతకు ఉద్యోగాలు, కాశ్మీరీ పండిట్లకు న్యాయం, జమ్మూ కాశ్మీర్​లో శాంతి, దేశ సమాఖ్య భావన వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీలు తమ తమ ఐడియాలజీకతీతంగా ముందుకు రావాలి’ అన్నారు. కాంగ్రెస్​ సుప్రీమ్​ సోనియా గాంధీ నియోజకవర్గమైన రాయ్​బరేలీలోనూ ఇలాగే అక్కడి ఎమ్మెల్యే రియాక్ట్​ కావడం గమనార్హం.  రాయ్​బరేలీ ఎమ్మెల్యే అదితి సింగ్​ ‘మనమంతా ఐక్యంగా నిలుద్దాం, జై హింద్​’ అన్నారు. ఆమె ఇలా అనడాన్ని కొందరు తప్పుబట్టినా జంకలేదు. ‘నేను ఒక ఇండియన్​ని’ అని తిరుగు జవాబిచ్చారు అదితి. కాంగ్రెస్​ సీనియర్​ నాయకుల్లో ఒకరైన అనిల్​ శాస్త్రి ప్రజల మూడ్​ని గుర్తించాలని సూచించారు. ‘ప్రజల మూడ్​ గమనించకుండా మనం గతంలో మండల్​ కమిషన్​ని వ్యతిరేకించాం. యూపీ, బీహార్​ రాష్ట్రాల్లో కోలుకోని దెబ్బ పడింది. ఇప్పుడు ఇండియాలో ఉనికి లేకుండా పోదామా?’ అని హై కమాండ్​ని ప్రశ్నించారు.