తెలంగాణ సర్కార్, ఆర్టీసీ జేఏసీ మధ్య చర్చలకు బ్రేక్.. కారణం ఏంటంటే..?

తెలంగాణ సర్కార్, ఆర్టీసీ జేఏసీ మధ్య చర్చలకు బ్రేక్.. కారణం ఏంటంటే..?

హైదరాబాద్: తెలంగాణ  ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ మధ్య చర్చలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులతో చర్చలను ప్రభుత్వం నిలిపివేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె డిమాండ్లలో ఆర్థిక పరమైన అంశాలు ఉండటం వల్ల ఎన్నికల అనంతరమే చర్చలు ఉండే అవకాశం ఉన్నట్లు  ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. గత కొంత కాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులకు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 

ఈ మేరకు 2025, జనవరి 27న ఆర్టీసీ జేఏసీ కార్మికులు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ అందించారు. ప్రధానంగా 21 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ క్రమంలో సోమవారం (ఫిబ్రవరి 10) ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఆర్టీసీ జేఏసీ కార్మికులు సిద్ధమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‎లోని  కార్మిక శాఖ కార్యాలయానికి వెళ్లారు. అయితే.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో జేఏసీ నేతలతో చర్చలు జరిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎవరూ హాజరు కాలేదు. 

దీంతో చేసేదేమి లేక.. నిరాశతో కార్మిక శాఖ కార్యాలయం నుండి ఆర్టీసీ జేఏసీ నేతలు బయటకు వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చర్చలను వాయిదా వేసినట్లు కార్మిక శాఖ అధికారులు పేర్కొన్నారు. డేట్ ఫిక్స్ చేసి మరోసారి చర్చలకు పిలుస్తామని తెలిపారు. అయితే.. జేఏసీ సమ్మె డిమాండ్‎లలో ఆర్థిక పరమైన అంశాలు ఉండటం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరమే చర్చలు ఉండే అవకాశం ఉంది. 2025, మార్చ్ 8 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. దీంతో మార్చి 8వ తేదీ తర్వాతే ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ మధ్య చర్చలు జరగొచ్చాని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.