- మంత్రి హామీతో ఆందోళన విరమణ.. నేటి నుంచి క్లాసులకు
- అర్ధరాత్రి వరకు క్యాంపస్‌లో చర్చించిన మంత్రి సబిత
- నెలరోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం
- త్వరలో వీసీని నియమిస్తాం
- 15 రోజుల్లో మళ్లీ వస్తానని వెల్లడి
భైంసా/బాసర, వెలుగు: బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులతో అర్ధరాత్రి వరకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నెలరోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని, స్టూడెంట్ల డిమాండ్మేరకు అతిత్వరలో రెగ్యులర్ వీసీని నియమిస్తామని హామీ ఇచ్చారు. 15 రోజుల్లో మళ్లీ క్యాంపస్‌కు వస్తానని చెప్పారు. ఇందుకు విద్యార్థులు అంగీకరించి.. ఆందోళన విరమించారు. మంగళవారం నుంచి క్లాసులకు హాజరవుతామని ప్రకటించారు. ఇన్చార్జ్ వీసీ రాహుల్ బొజ్జాతో కలిసి సోమవారం రాత్రి ట్రిపుల్ఐటీ క్యాంపస్ కు చేరుకున్న మంత్రి సబిత.. స్టూడెంట్స్‌తో రాత్రి 9.30 గంటల తర్వాత రెండుగంటలకుపైగా చర్చలు జరిపారు. ల్యాప్టాప్స్ పంపిణీ, క్వాలిటీ ఫుడ్ సహా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, స్టూడెంట్స్ తమ ఆందోళన విరమించి క్లాసులకు హాజరుకావాలని కోరారు.
మొక్కవోని ధైర్యంతో వారం రోజులుగా..
బాసర ట్రిపుల్ ఐటీలో వివిధ సమస్యలు పరిష్కరించాలని, రెగ్యులర్ వీసీని నియమించాలనే డిమాండ్లతో వారం రోజులుగా స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు. ఎండ, వానను లెక్కచేయకుండా క్యాంపస్‌లో కూర్చొని నిరసన చేపట్టారు. స్టూడెంట్స్ గవర్నింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మొక్కవోని ధైర్యంతో దీక్షకు పూనుకున్నారు. ఈ క్రమంలో క్యాంపస్బయట కొద్దిరోజులుగా వందలాది మంది పోలీసులను మోహరించడం, స్టూడెంట్లకు మద్దతు తెలిపేందుకు వచ్చేవాళ్లను అరెస్ట్ చేస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నది. స్టూడెంట్ల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన ప్రతిపక్ష పార్టీల లీడర్లను, విద్యార్థి సంఘాల నేతలను, ఆఖరికి విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పోలీసులు వదిలిపెట్టలేదు. ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తూ వచ్చారు.
మరోవైపు స్టూడెంట్స్‌తో జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, లోకల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి , కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖి, ఎస్పీ ప్రవీణ్ కుమార్పలు దఫాలుగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. గతంలో సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చి అమలు చేయని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని స్టూడెంట్స్ నమ్మలేదు. తమ సమస్యల పరిష్కారంపై సీఎం కేసీఆర్‌గానీ, మంత్రి కేటీఆర్‌గానీ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. ఎట్టకేలకు సోమవారం రాత్రి 9.30 గంటలకు ట్రిపుల్ ఐటీకి ప్రభుత్వం తరఫున విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి చేరుకున్నారు. ఆఫీసర్ల సమక్షంలో స్టూడెంట్స్‌తో అర్ధరాత్రి వరకు ఆమె చర్చలు జరిపారు.
తన కామెంట్స్ పట్టించుకోవద్దన్న మంత్రి
చర్చలకు మీడియాను అనుమతించలేదు. కానీ చర్చల అనంతరం స్టూడెంట్స్ తెలిపిన వివరాల ప్రకారం.. తమవి సిల్లీ సమస్యలంటూ మంత్రి చేసిన కామెంట్స్‌ను చర్చల ప్రారంభంలోనే పలువురు స్టూడెంట్స్మంత్రి సబిత దృష్టికి తెచ్చారు. ఆ కామెంట్స్ తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని, వాటిని పట్టించుకోవద్దని మంత్రి కోరారు. అనంతరం స్టూడెంట్స్ తమ 12 డిమాండ్లను మంత్రి ముందు పెట్టారు. వీటిలో ల్యాప్ టాప్స్పంపిణీ, క్వాలిటీ ఫుడ్, ప్యూరిఫై వాటర్ అందించడంతో పాటు ప్లంబింగ్, ఎలక్ట్రికల్లాంటి పనులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. రెగ్యులర్ వీసీని త్వరలోనే నియమిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇకపై ట్రిపుల్ ఐటీలో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలా చారి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకట రమణ, డైరెక్టర్ సతీశ్ కుమార్, కలెక్టర్ ముషారఫ్ ఆలీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్ చర్చల్లో పాల్గొన్నారు.