ములకలపల్లి, వెలుగు : ములకలపల్లి టు తాళ్లపాయి మధ్య ఉన్న బ్రిడ్జి వద్ద డైవర్షన్ రోడ్డు నిర్మించాలని తాళ్లపాయి పంచాయతీ ప్రజలు సోమవారం ములకలపల్లి మెయిన్ రోడ్డుపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సుందర్, ఉదయ్ మాట్లాడుతూ గత ఆరు నెలలుగా రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో రైతులు, విద్యార్థులు, వృద్ధులు మండల కేంద్రానికి రావాలంటే సుమారు రూ.200 చార్జీతో రవాణా చేయాల్సి వస్తోందని తెలిపారు. బ్రిడ్జి వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రైలింగ్ వంతెన ప్రమాదకరంగా ఉండడంతో చాలామంది ప్రజలు వంతెన రైలింగ్ వద్ద కింద పడ్డారని చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే, మంత్రికి ప్రజలు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఐ బద్రు ఆందోళనకారుల వద్ద వచ్చి నాలుగు రోజుల్లో సొంత ఖర్చులతో సైడ్ డైవర్షన్ రోడ్డు నిర్మిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన రాష్ట్ర నాయకుడు, ఆదివాసి లీగల్ అడ్వైజర్ ఊకే రవి, పోడియం ప్రేమ్ కుమార్, సీపీఐ నాయకులు నరాటి రమేశ్, సీపీఎం మండల అధ్యక్షుడు ముదిగొండ రాంబాబు, టీడీపీ నాయకులు శంకర్రావు, బిక్కు మల్ల సుధాకర్, బీ ఆర్ఎస్ నాయకులు కుంజ రాంబాబు, మాజీ సర్పంచ్ వాడే నాగరాజు, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు కుంజా కృష్ణ, జనసేన పార్టీ జిల్లా నాయకుడు రాంబాబు, గ్రామస్తులు కోండ్రు బాబు,కారం రాంబాబు,గడ్డం రాములు, కీసరి రమేశ్, సున్నం సాగర్ తదితరులు ఉన్నారు.