నేతకాని జనాభాను తక్కువ చూపడం సరికాదు : తాళ్లపెల్లి రాజేశ్వర్

నేతకాని జనాభాను తక్కువ చూపడం సరికాదు : తాళ్లపెల్లి రాజేశ్వర్

జన్నారం, వెలుగు: తమ కుల జనాభాను ప్రభుత్వం తక్కువ చేసి చూపిందని, తాము 1,33,072 మంది మాత్రమే ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం సరికాదని నేతకాని సంక్షేమ సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తాళ్లపెల్లి రాజేశ్వర్ మండిపడ్డారు. గురువారం జన్నారంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఖమ్మం జిల్లా నుంచి నిజామాబాద్ వరకు సుమారు 15 లక్షల నుంచి 18 లక్షల వరకు నేతకాని జనాభా ఉందన్నారు.

తమ కులాన్ని తక్కువ చేసి చూపించడం బాధాకరమని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. తెలంగాణలో మాల, మాదిగల తర్వాత మూడవ స్థానంలో నేతకానీలున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ కులానికి సంబంధించి సరైన లెక్కలు చూపి న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నేతకాని సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జాడి గంగాధర్, మండల ప్రెసిడెంట్ రత్నం లక్ష్మణ్, రాష్ట్ర నేత బి.ప్రభుదాస్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జాడి వెంకట్, నాయకులు డాక్టర్ రవిశంకర్, జె.మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.