
తమన్నా ఫిమేల్ లీడ్‌గా నటించిన చిత్రం ‘ఓదెల 2’(Odela 2). సంపత్ నంది కథను అందించిన ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకుడు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై డి. మధు నిర్మించారు. ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది.
నేడు గురువారం (2025 ఏప్రిల్ 17న) థియేటర్లలో ‘ఓదెల 2’ విడుదలైంది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా ముఖ్య పాత్రలు పోషించారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించిన సూపర్ నేచురల్ మైథాలజికల్ థ్రిల్లర్ ఎలా ఉంది? సినిమా చూసిన ఆడియన్స్ ఎలా మాట్లాడుకుంటున్నారు? సంపత్ నంది రాసుకున్న కథలో ఎలాంటి థ్రిల్లర్ అంశాలు ఉన్నాయనేది రివ్యూలో చూద్దాం.
కథేంటంటే:
ఫస్ట్ పార్ట్ ‘ఓదెల రైల్వేస్టేషన్’కథ ముగించిన చోటే మొదలుపెట్టాడు దర్శకుడు. ఊరిలో కొత్తగా పెళ్లయిన ఆడవాళ్లను శోభనం రాత్రి రేప్ చేసి చంపేస్తున్న తన భర్త తిరుపతి (వశిష్ట సింహ)ను రాధా (హెబ్బా పటేల్) తల నరికి చంపేస్తుంది. అతని తలతోపాటు పోలీస్టేషన్‌కి వెళ్లి లొంగిపోవడంతో ‘ఓదెల రైల్వేస్టేషన్’కథ ముగిసింది. దీంతో ఆమె జైలు పాలవుతుంది.
ఆ తర్వాత రాధా భర్త తిరుపతి శవాన్ని కాల్చకుండా, ఊరివాళ్లంతా కలిసి అతని శవానికి సమాధి శిక్ష వేస్తారు. అలా తిరుపతి శవాన్ని సమాధిలో నిటారుగా పూడ్చిపెట్టి ఆత్మ వెళ్లిపోకుండా, మోక్షం పొందకుండా ఉండేలా శిక్ష వేస్తారు. ఆ తర్వాత గ్రామంలో అనుకోని కొన్ని సంఘటనల వల్ల, ఊళ్ళో కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిల హత్యలు మొదలవుతాయి.
►ALSO READ | OTT Suspence Thriller: ఓటీటీలోకి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ క్రమంలో గ్రామస్తులందరూ కలిసి జైలులో ఉన్న రాధను కలుస్తారు. ‘వాడ్ని చంపింది నువ్వే. ఇప్పుడు కాపాడాల్సింది నువ్వే’ అని ప్రాధేయపడతారు. ఈ క్రమంలో శివ నామస్మరణలో జీవితాన్ని కొనసాగిస్తున్న నాగసాధువు అలియాస్ భైరవి (తమన్నా భాటియా) ఓదెల గ్రామానికి వస్తుంది. అప్పుడక్కడ ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి?
ఎక్కడో కాశీలో తపస్సు చేసుకునే భైరవి ఓదెల గ్రామానికి ఎందుకు వచ్చింది? తిరుపతి అరాచకాన్ని ఎలా వంచింది? అసలు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలని చంపేది తిరుపతి ఆత్మా? లేక వేరే ఎవరైననా? జైలులో గ్రామస్థులకు రాధ చెప్పిన మాటేంటీ? వంటి విషయాలు తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
ఓదెల మొదటి భాగాన్ని సస్పెన్స్ థ్రిల్లర్గా రాసుకున్న సంపత్ నంది.. ఈ రెండో భాగాన్ని ఆత్మ వర్సెస్ పరమాత్మ ఆధారంగా రూపొందించారు. ఆయన గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా సినిమా కథను రాసుకుని థ్రిల్లింగ్ అంశాలను జోడించారు.
అయితే, ఒక ఊరు, ఆ ఊరిలో వరుస చావులు, ప్రేతాత్మ అంటూ వచ్చే ఓ శక్తి, ఆ తర్వాత ఆ ఊరిని రక్షించడానికి వచ్చే అమ్మోరు రూపంలో ఓ మనిషి.. ఇలాంటి కథలు తెలుగు తెరపై కొత్తెం కాదు. కానీ, ఓదెల 2 కోసం రాసుకున్న గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఉత్కంఠ రేపే సీన్స్ కొత్తదనం కలిగించేలా చేశాయి.
'భరత ఖండాన, దక్షిణ గంగా తీరాన, ఆ పరమాత్ముడి పుట్టిల్లు అయిన ఓదెలలో ఓ ప్రేతాత్మ పురుడు పోసుకుంటోంది. ఇక ఆవిరైన ప్రతి రక్తపు బొట్టును కూడగట్టుకుంటూ అవకాశం కోసం నిరీక్షిస్తోంది’ అని చెప్పే మాటలు సినిమా స్టార్టింగ్ లోనే వణుకు పుట్టించేలా ఉంటాయి. ‘మనం నిలబడాలంటే భూమాత.. మనం బ్రతకాలంటే గోమాత. మీరు బ్రతకడం కోసం వాటిని చంపక్కర్లేదు..’ లాంటి డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి.
కథ విశ్లేషణకి వెళ్తే.. ఫస్టాఫ్ రాధ తల నరికి స్టేషనుకి వెళ్లడం, ఆ ఊరి ప్రజలు అతన్ని పూడ్చడం, ఆ తర్వాత కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు చనిపోవడం ఆసక్తి కలిగిస్తాయి. అలా, ఆ హత్యలన్నీ, తిరుపతి ఆత్మే చేస్తుందని ఊళ్ళో వాళ్లకు తెలిసిన దగ్గర్నుంచి కథలో మరింత ఉత్కంఠ పెరుగుతుంది. ఇక ఆ వినాశశక్తిని ఎదుర్కోవడానికి గ్రామస్తులంతా జైలుకి వెళ్లి రాధను కలిసే అంశాలు, ఇంటర్వెల్ ముందు భైరవి ఇచ్చే ఎంట్రీ సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ పెంచుతుంది.
అయితే, ఈ మొదటి భాగం చూస్తే, అరుంధతి సినిమా గురొచ్చే అవకాశం ఉంది. పశుపతిని అరుంధతి సమాధి చేసినట్టుగానే, ఇందులో తిరుపతిని ఊరిజనం సమాధి చేస్తారు. అరుంధతి షయాజీ షిండే పాత్రను గుర్తు చేసేలా ఇందులో మురళీశర్మ పాత్ర కనిపించింది.
ఇక సెకండాఫ్ లో తిరుపతి చేసే వినాశనం, ఆ ప్రేతాత్మతో భైరవి పోరాడే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా దెయ్యానికి, భైరవి మధ్య వచ్చే సంఘటనలు ఆడియన్స్‌కి గూజ్‌బంప్స్ తెప్పిస్తాయి. ఈ క్రమంలో వచ్చే అజనీష్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మెయిన్ అసెట్గా నిలిచింది.
ఎవరెలా నటించారంటే:
ఓదెల గ్రామానికి పొంచి ఉన్న ముప్పు నుంచి ప్రజలను కాపాడటానికి నాగ సాధు పాత్రలో తమన్నా చేసిన పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ఇది తన కెరియర్లోనే బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. ప్రేతాత్మగా నటించిన వశిష్ట సింహ విశ్వరూపం చూపించేశాడు. తనదైన హావభాలతో, అరుపులతో అదరగొట్టేశాడు. హెబ్బా పటేల్ పాత్ర పరిధి తక్కువే. అయినప్పటికీ ఓకే అనిపిస్తుంది. శ్రీకాంత్ అయ్యంగార్, నాగ మహేష్, మురళి శర్మ.. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు:
అజనీష్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలం. ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేశాడు. సినిమాటోగ్రఫీ సౌందరరాజన్ వర్క్ చాలా డీసెంట్ గా ఉంది. సినిమాకు మరో బలంగా సినిమాటోగ్రఫీ నిలిచింది. సంపత్‌నంది రాసుకున్న కథ పాతదే అయినప్పటికీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో మెప్పించాడు. దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కించిన విధానం బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.