మాజీ భార్య ఫిర్యాదు చేయడంతో ప్రముఖ నటుడు అరెస్ట్...

మాజీ భార్య ఫిర్యాదు చేయడంతో ప్రముఖ నటుడు అరెస్ట్...

తమిళ ప్రముఖ నటుడు బాలా కొన్ని రోజులుగా తన మాజీ భార్య అమృత సురేష్ తో విభేధాలు ఎదుర్కుంటున్నాడు. దీంతో అమృత సురేష్ నటుడు బాలాపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం (అక్టోబర్ 14) తెల్లవారుజామున కేరళలోని కడవంట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బాలా సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేస్తూ పరువుకి భంగం కలిగించడం మరియు తన పిల్లలపట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి అభియోగాలు చేస్తూ అమృత సురేష్  ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే త్వరలోనే నటుడు బాలా ని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
 
అసలు విషయం ఏమిటంటే ఇటీవలే నటుడు బాలా మరియు అమృత సురేష్ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. దీంతో వీరి కూతురు అవంతిక ఈ విషయంలో కలగజేసుకుని గతంలో తనని బాలా శారీరకంగా, మానసికంగా హింసించడాని వీడియో షేర్ చేసింది. అయితే బాలా ఈ వీడియోపై స్పందిస్తూ కనీసం ఈ విధంగానైనా తనని తండ్రిగా అంగీకరించినందుకు థాంక్స్ అంటూ సెటైరికల్ గా రిప్లయ్ ఇచ్చాడు. దీంతో అమృత సురేష్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాలా మరియు అమృత సురేష్ ఆగస్టు 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే గతంలో మనస్పర్థలు విభేధాలు రావడంతో నాలుగేళ్లపాటు విడివిడిగా జీవించారు. ఈ క్రమంలో వీరిద్దరినీ కలపడానికి ఇరువురి కుటుంబ పెద్దలు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. దీంతో 2019లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.