
కథే హీరో.. అంటూ కొన్ని సినిమాలు వస్తుంటాయి. వాస్తవికతకు దగ్గరగా ఉండే పాత్రలు, సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఆ సినిమాలు వర్కవుట్ అయ్యాయంటే మాత్రం ఆ కథకు ప్రాణం పోసిన నటులదే కీలక పాత్ర. పైగా అలాంటి కథలు, పాత్రలు చూస్తుంటే అవి కొందరికే సరిపోతాయి అనిపిస్తుం టుంది. అలా కనిపించే నటుల్లో కథిర్ కూడా ఉన్నాడు. తను చేసిన సినిమాలన్నింటిలో పాత్రకు తగ్గట్టు చాలా నేచురల్‌గా కనిపించి, ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘సుడల్: ది వర్టెక్స్’ అనే ఒకే ఒక్క వెబ్ సిరీస్‌లో నటించి అన్ని భాషల్లోనూ ఆడియెన్స్‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆ సిరీస్‌కి రెండో భాగంగా ‘సుడల్: ది వర్టెక్స్’ సీజన్ –2 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా కథిర్ గురించి ఇంట్రెస్టింగ్ సంగతులివి.
కథిర్ సొంతూరు తమిళనాడులోని ఈరోడ్. కోయంబత్తూర్‌లోని కుమారగురు కాలేజీ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివాడు. కాలేజీ చదివే రోజుల్లోనే తమిళంలో ‘మాధ యానై కూట్టమ్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కాలేజీ అయిపోయాక సాయంత్రం వేళలో సినిమా షూటింగ్ చేసేవాళ్లట. ఈ సినిమాని మ్యూజిక్ డైరెక్టర్ జి.వి ప్రకాశ్ ప్రొడ్యూస్ చేశాడు. ఆ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత కిరుమి, విక్రమ్ వేద, పరియేరుమ్ పెరుమాల్, సిగై, జడ, శర్బత్ వంటి సినిమాల్లో నటించాడు.
స్క్రిప్ట్ సెలక్షన్
‘కిరుమి’ అనే సినిమా ‘19వ టొరంటో రీల్ ఏసియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్రదర్శించారు. అయితే ఈ సినిమా గురించి కథిర్ ‘‘ఇప్పటికీ ఈ సినిమాలో ‘క్లైమ్యాక్స్ అలా జరగకుండా ఉంటే బాగుండు’ అంటుంటారు కొంతమంది. అయితే ఇలాంటి కథల్లో వాస్తవికతను చూపిస్తాం. కాబట్టి అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నా మొదటి సినిమా ‘మాధ యాన్నై కొట్టమ్’ గురించి కూడా ఇలాగే చెప్తుంటారు. వాళ్లు అలా చెప్పినప్పుడల్లా ఇప్పటికీ ఆ సినిమాలు గుర్తుంచుకున్నందుకు సంతోషంగా ఫీలవుతా. అలాంటి కథలు, పాత్రలు చేశాను. కాబట్టే ఈ రోజు ఇలా ఉన్నా అనిపిస్తుంది” అని చెప్పారు. అంతేకాకుండా ‘పరియేరుమ్ పెరుమాల్’ సినిమా సమానత్వం గురించి. అలాగని రాజకీయాలు, ప్రసంగాల గురించి కాదు. ఇందులో కొన్ని సోషల్ మెసేజ్‌లు ఉన్నాయి. అలాగే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఇలా ఒక్కో సినిమాకి ఒక్కో ప్రత్యేకత ఉంది. అందుకు కారణం అతని స్క్రిప్ట్ సెలక్షనే.
సాధారణంగా తన స్క్రిప్ట్ సెలక్షన్ ఎలా ఉంటుందనే ప్రశ్నకు.. కథిర్ చెప్పిన సమాధానం ఇది. ‘‘నా వరకు స్క్రిప్టే ఫస్ట్ హీరో. దాన్నిబట్టి నా దారిని ఏర్పరుచుకుంటా. ‘కథిర్ సినిమా’ ఎందుకు చూడాలి? అని ప్రేక్షకులు అడిగితే వాళ్లకు నేను సమాధానం చెప్పగలగాలి. అందుకే నా కెరీర్లో కొన్ని సినిమాలే ఉన్నాయి. అలాగే నేను కమర్షియల్ సినిమాలతో పాటు అన్నిరకాల జానర్లలో నటించాలనుకుంటున్నా. అయితే రియలిస్టిక్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా.
కమర్షియల్ హంగుల విషయంలో అస్సలు రాజీపడను. ఎందుకంటే నా సినిమాలన్నీ కంప్లీట్ ప్యాకేజీలా ఉండాలి అని కోరుకుంటా. ప్రజలకు ఏం నచ్చుతుందో జడ్జ్ చేయలేం. స్టోరీ వినేటప్పుడు నేను ఒక ప్రేక్షకుడిలానే వింటా. అది నాకు సరిపోతుందా? లేదా అని ఆలోచిస్తానంతే. సినిమాల్లో కమర్షియల్, నాన్ కమర్షియల్ అనే లేబుల్స్ మీద నాకు నమ్మకం లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేయడానికే. అది కూడా కథ డిస్టర్బ్ కానంతవరకే. ఇలాంటి విషయాలు నేను రోజూ నేర్చుకుంటూనే ఉంటా’’ అని చెప్పారు.
అది సాహసమే..
‘విక్రమ్ వేద’ సినిమాలో నాకు గెస్ట్ అప్పీయరెన్స్ అవకాశం వచ్చింది. నేను సోలో లీడ్ పాత్రలు చేస్తున్నప్పటికీ ఆ అవకాశాన్ని వదులుకోవాలనుకోలేదు. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పుష్కర్, గాయత్రి.. వాళ్లే నాకు ఇండస్ట్రీలో బాగా తెలిసిన వ్యక్తులు. నేను ఏదైనా ప్రాజెక్ట్ ఓకే చేసేముందు దాని గురించి వాళ్లతో మాట్లాడతాను. అలాగే మరో కారణం ఆ సినిమాలో నటించిన ఇద్దరు స్టార్ యాక్టర్స్. విజయ్ సేతుపతి కూడా నాకు ఏం చెప్పారంటే.. ‘ఈ సినిమాలో నీకు వచ్చిన అవకాశం ఎంత గొప్పదో తెలియదు కానీ, దీనివల్ల నీ కెరీర్‌కి ఎక్కడా నెగెటివిటీ మాత్రం రాదు’ అని. నేను కూడా ఆలోచించి.. ఈ పాత్ర సినిమాలో అవసరమైనంత మేరకే ఉంటుంది కదా అనుకుని ఒక నిర్ణయానికి వచ్చాను. అయితే సినిమా ఓకే అయ్యాక, షూటింగ్ టైంలో సేతుపతి, మాధవన్‌ల నుంచి నేను ఎంతో నేర్చుకున్నా.
‘సుడల్’ చాలా స్పెషల్
ఈ సిరీస్ ఊహించనంత పెద్ద హిట్ అయింది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ కేవలం కథతోపాటు స్క్రీన్ ప్లే, పర్ఫార్మెన్స్లు, ఫిల్మ్ మేకింగ్ గురించి కూడా మాట్లాడారు. చాలా తక్కువ సినిమాలు లేదా సిరీస్‌లకు మిగతా క్రాఫ్ట్స్ గురించి మాట్లాడుతుంటారు. ఈ విషయంలో సుడల్ సిరీస్ మా టీంకి చాలా సంతోషాన్నిచ్చింది. ఇందులో నాది పోలీస్ పాత్ర అని చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ క్యారెక్టర్లో చాలా లేయర్స్ ఉన్నాయి. అది నన్ను ఇంకా ఎగ్జైట్ చేసిన విషయం. ఇలాంటి పాత్ర నేనెప్పుడూ పోషించలేదు. అయితే ఇందులో నాకు సవాలుగా అనిపించిందేంటంటే.. ఎమోషనల్ వేరియేషన్స్ చూపించాలి.
దానికితోడు ఈ సిరీస్ షూటింగ్ చేస్తున్న టైంలో రెండు సార్లూ ప్యాండెమిక్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సెట్లో అందరూ మేకప్ వేసుకున్నాక మాస్కులు పెట్టుకుని ఉండడం చాలా ఇబ్బందిగా అనిపించేది. రకరకాల ప్రదేశాల్లో షూటింగ్ చేయడం కూడా చాలెంజింగ్గానే ఉండేది. నా పాత్ర పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి? అని డైరెక్టర్స్‌తో డిస్కస్ చేసేవాడిని. వాళ్ల సూచనలతో నా పర్ఫార్మెన్స్ని బెటర్ చేసుకునేవాడిని. ఈ సిరీస్‌లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. ఇందులో చిన్న పాత్రలు చేసినవాళ్లు కూడా చాలా అద్భుతంగా నటించారు. మామూలుగానే ఇప్పుడు సిరీస్‌లకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. వాటిలో ఈ సిరీస్ కూడా ఉంది. ఈసారి కూడా స్క్రీన్ ముందు నుంచి కదలకుండా చూసే థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయి.
విజయ్‌తో టైం స్పెండ్ చేయాలని..
‘బిగిల్’ సినిమాలో ఒక పాత్రకు నన్ను అడిగాడు డైరెక్టర్ అట్లీ. వెంటనే నేను చేస్తానని చెప్పా. అయితే అట్లీ..‘స్ర్కిప్ట్ విన్నాక రెండు రోజులు బాగా ఆలోచించి ఆ తర్వాత నీ నిర్ణయం చెప్పు’ అన్నాడు. నిజానికి ఎవరైనా కాస్త టైం తీసుకుని చెప్పడం అనేది కామన్. కానీ, నాకు విజయ్ అంటే చాలా ఇష్టం. ఆయన నటన మాత్రమే కాదు.. పర్సనల్‌గా కూడా ఆయనకు వీరాభిమానిని. అందుకే ఆయన సినిమాలో ఛాన్స్ అనగానే అస్సలు ఆలోచించకుండా ఓకే చెప్పా.
ఆ సినిమాలో నటించేటప్పుడు విజయ్ వర్కింగ్ స్టైల్ చూసి ఆశ్చర్యపోయా. క్లాస్‌రూమ్‌లో నేర్చుకునేవి సెట్లోనే నేర్చుకోవచ్చు అనిపించింది. విజయ్ బాడీ లాంగ్వేజ్, తనదైన యాక్షన్స్‌తో ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తారు. అది అచ్చం అలాగే రీక్రియేట్ చేయడం సాధ్యం కాదు. కానీ, దానివల్ల ఏం జరుగుతుందనేది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇలాంటివన్నీ షూటింగ్లో చూసి నేర్చుకోగలం. అన్నింటికన్నా ముఖ్యంగా ‘తక్కువ మాట్లాడాలి. ఎక్కువ పనిచేయాలి’ అనేది విజయ్ నుంచే నేర్చుకున్నా. ఆయన చాలా సైలెంట్‌గా ఉంటారు. ఎక్కువ కష్టపడి పనిచేస్తారు. పైగా ఈ విషయం ఆయన్ని ఎంతో అబ్జర్వ్ చేస్తే గానీ అర్థం కాదు.