
చెన్నై: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లు, 2024కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. సీఎం ఎం.కె. స్టాలిన్ గురువారం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ముస్లింల హక్కులను, మత స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని అన్నారు. వక్ఫ్‌సవరణ బిల్లును వాపస్ తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. బీజేపీ ప్రభుత్వం మైనార్టీలపై వివక్షను చూపుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీరు రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకునేరీతిలో ఉందన్నారు.
హిందీని రాష్ట్రాలపై రుద్దడం, బీజేపీయేతర రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోవడం, సీఏఏ, నీట్.. ఎన్ఈపీ వంటి సామాజిక న్యాయ విరుద్ధ విధానాలను బలవంతంగా రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ముస్లింల మతపరమైన ఆస్తులను కూడా కంట్రోల్ చేసేలా వక్ఫ్ చట్టం ఉండబోతోందన్నారు. దీంతో మైనార్టీల ప్రాథమిక హక్కులు కూడా హరించుకుపోతాయన్నారు. వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకునే కుట్రలో భాగంగానే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు భాగస్వామ్యం చేసేలా సవరణలు ప్రతిపాదించారని స్టాలిన్ ఆరోపించారు. గతంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు కూడా తమిళనాడు ఈ బిల్లును వ్యతిరేకించిందన్నారు.
ఏ భాషకూ వ్యతిరేకం కాదు..
ఓట్లు తగ్గుతాయనే భయంతోనే తమిళనాడు సర్కారు డీలిమిటేషన్, హిందీ భాషను వ్యతిరేకిస్తోందన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలకు సీఎం స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. ద్విభాషా విధానం, డీలిమిటేషన్‌పై తమిళనాడు మొదటినుంచీ స్ట్రాంగ్వాయిస్ వినిపిస్తుంటే, బీజేపీ వణికిపోతోందని అన్నారు. అందుకే ఆ పార్టీ తన నేతలతో రకరకాలుగా మాట్లాడిస్తోందన్నారు. ‘‘ద్వేషం గురించి యోగి మాకు పాఠాలు నేర్పాలనుకుంటున్నారా..? ఇది రాజకీయంగా అతిపెద్ద బ్లాక్ కామెడీ. మేము ఏ భాషను వ్యతిరేకించం. బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తాం. మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తాం. ఇది న్యాయం కోసం పోరాటం” అని స్టాలిన్ అన్నారు.