Udhayanidhi Stalin: ‘కొడుకుకు ప్రేమతో’.. తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్

Udhayanidhi Stalin: ‘కొడుకుకు ప్రేమతో’.. తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్

చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ పేరు ఖరారైంది. సెప్టెంబర్ 29న సాయంత్రం 3.30 గంటలకు తమిళనాడు రాజ్భవన్లో ఆయన ప్రమాణ స్వీకారం జరగనుంది. తమిళనాడు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయన కుమారుడు ఉదయనిధి పేరును ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించారు.

 

తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవికి ఈ మేరకు శనివారం (సెప్టెంబర్ 28, 2024) మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనల్లో తన కొడుకును డిప్యూటీ సీఎంగా ప్రతిపాదిస్తున్నట్లు గవర్నర్కు స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి కూడా స్టాలిన్ పంపిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలోని అన్ని ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. దీంతో.. తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధికి మార్గం సుగమమైంది.

ALSO READ | కరీంనగర్లో అరుదైన ఘటన.. ‘శ్రీనివాస్’ అనే పేరున్నోళ్లంతా వెంకటేశ్వర స్వామి గుళ్లో కలుసుకున్నరు !

తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని కైవసం చేసుకోగా... ఎంకే స్టాలిన్ సీఎం అయ్యారు. ఆయన కుమారుడు ఉదయనిధి కూడా చెన్నైలోని చెపాక్-తిరువళ్లికేణి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. స్టాలిన్ కేబినెట్ లో ప్రస్తుతం యువ సంక్షేమ, క్రీడా శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఉదయనిధి స్టాలిన్ వయసు 46 సంవత్సరాలు.  మనీ లాండరింగ్ కేసులో ఇటీవల సుప్రీం కోర్టు నుంచి బెయిల్ పొందిన సెంథిల్ బాలాజీని కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు.