
- డీలిమిటేషన్, హిందీ ఇంపోజిషన్‌పై పార్టీ క్యాడర్‌కుతమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపు
- ఈ రెండింటితో దక్షిణాదిరాష్ట్రాలకు అన్యాయం
- కేంద్ర నిర్ణయాలను తెలంగాణ, కర్నాటక వ్యతిరేకిస్తున్నాయని వెల్లడి
చెన్నై: జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అన్నారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని మండిపడ్డారు. అంతేగాకుండా దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తున్నదని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు.
తన బర్త్ డే (మార్చి 1) సందర్భంగా పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి స్టాలిన్ వీడియో మెసేజ్ విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం మనం రెండు క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్నం. ఒకటి మాతృభాషను కాపాడుకునేందుకు చేస్తున్న యుద్ధం. మరొకటి డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం. మాతృభాష మనకు లైఫ్‌లైన్, డీలిమిటేషన్ మన హక్కు” అని అందులో పేర్కొన్నారు. ‘‘తమిళనాడు భవిష్యత్తు, ప్రయోజనాల విషయంలో ఎవరి కోసం, దేనికోసం రాజీపడబోమని మనందరం ప్రతిజ్ఞ చేద్దాం. తమిళనాడు కోసం మనందరం పోరాడుదాం. తమిళనాడు పోరాడుతుంది.. తమిళనాడు గెలుస్తుంది” అని అన్నారు.
జనాభా ప్రాతిపదికన వద్దు..
డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే.. ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్‌ను సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసి జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. ‘‘జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టి సౌత్ స్టేట్స్‌కు శిక్ష విధించవద్దు. ఒకవేళ అలా చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. కేంద్ర ప్రయత్నాలను అడ్డుకుంటం” అని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టవద్దని డిమాండ్ చేశారు.
కేంద్రం బ్లాక్‌మెయిల్ చేస్తున్నది..
కేంద్రం త్రీ–లాంగ్వేజ్ పాలసీతో దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దాలని చూస్తున్నదని స్టాలిన్ మండిపడ్డారు. తాము ఏ భాషకూ వ్యతిరేకం కాదని, కానీ బలవంతంగా హిందీని రుద్దడాన్నే వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. త్రీ–లాంగ్వేజ్ పాలసీకి ఆమోదం తెలపాలని తమిళనాడుపై కేంద్రం ఆర్థిక పరంగా ఒత్తిడి చేస్తున్నది. రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదు.
త్రీ-లాంగ్వేజ్ పాలసీకి ఆమోదం తెలిపితేనే నిధులు ఇస్తామని బ్లాక్‌మెయిల్ చేస్తున్నది” అని ఫైర్ అయ్యారు. కేంద్ర నిర్ణయాలను ఇతర రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ‘‘కర్నాటక, పంజాబ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు మనకు మద్దతుగా నిలుస్తున్నాయి. అన్ని స్కూళ్లలో పంజాబీ భాషను తప్పనిసరి చేస్తూ పంజాబ్ సర్కార్ ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. అలాగే ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది” అని తెలిపారు.