అది పరాజయ కూటమి: బీజేపీ, అన్నాడీఎంకే పొత్తుపై స్టాలిన్ ​విమర్శలు

అది పరాజయ కూటమి: బీజేపీ, అన్నాడీఎంకే పొత్తుపై స్టాలిన్ ​విమర్శలు

న్యూఢిల్లీ: తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తుపై ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్​ తీవ్ర విమర్శలు చేశారు. ఈ పొత్తును ‘‘పరాజయ కూటమి’’గా  పేర్కొన్నారు.  అధికారం కోసమే ఈ రెండు పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని ఫైర్​ అయ్యారు. ‘‘ఏఐఏడీఎంకే-, బీజేపీ కూటమి విఫలం కానుంది. ఈ కూటమిని పదే పదే ఓడించింది తమిళనాడు ప్రజలే. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అదే విఫలమైన కూటమిని పునర్నిర్మించారు” అని స్టాలిన్​ ఎద్దేవా చేశారు.

  ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ–ఏఐఏడీఎంకే ఒప్పందంలో సైద్ధాంతిక స్పష్టత లేదని అన్నారు. ఈ కూటమి ఆధారపడిన ప్రాథమిక సూత్రాలను షా స్పష్టంగా చెప్పలేకపోయారు.  ‘‘నీట్, త్రిభాషా విధానం, వక్ఫ్ చట్టాన్ని అన్నాడీఎంకే వ్యతిరేకిస్తున్నది. 

నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడు ప్రాధాన్యం తగ్గించొద్దని చెబుతున్నది. ఇవన్నీ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో భాగమా? కేంద్రమంత్రి వీటి గురించి ఏం మాట్లాడలేదు. అన్నాడీఎంకే నాయకత్వం మాట్లాడటానికి కూడా అమిత్ షా అనుమతించలేదు. కేవలం డీఎంకేని తిట్టడానికి మాత్రమే ఆయన ఈ సమావేశాన్ని ఉపయోగించారు’’ అని స్టాలిన్ పేర్కొన్నారు.