‘పుష్ప’ మూవీ పాట పాడిన తమిళనాడు కలెక్టర్

తమిళనాడు: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేసిన ‘పుష్ప’మూవీ పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలోని పాటలు, డైలాగులు యూట్యూబ్ ను షేక్ చేశాయి. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన ‘చూపే బంగారమాయెనే శ్రీవల్లీ’ అనే సాంగ్ కు యూట్యూబ్ లో 380 మిలియన్ కు పైగా వ్యూస్, 4.5 మిలియన్ లైక్స్ వచ్చాయి. మూమూలు జనాల నుంచి మొదలుకొని దేశ, విదేశాలకు చెందిన సెలెబ్రిటీల వరకు ఎంతో మంది ఈ పాటకు స్టెప్పులేశారు, గొంతూ కలిపారు. 

అయితే రిలీజై నాలుగు నెలలు దాటుతున్నా.. జనాల్లో పుష్ప మూవీకి ఏమాత్రం క్రేజ్ తగ్గలే. తాజాగా తమిళనాడులోని కరూర్ జిల్లా కలెక్టర్ ప్రభు శంకర్  శ్రీవల్లి పాటను అద్భుతంగా పాడారు. పాటకు తగ్గట్లు గిటార్ కూడా వాయిస్తూ రాక్ స్టార్ ను తలపించారు. తెలుగు భాష రాకపోయినప్పటికీ తెలుగు లిరిక్స్ నేర్చుకొని మరీ పాడారు. పాట చివర్లో తనకు తెలుగు రాదని, తప్పులు ఉంటే క్షమించాలని కలెక్టర్ ప్రభు శంకర్ కోరారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కలెక్టర్ పాటకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. 

అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందాన్నా హీరోయిన్ గా నటించిన ‘పుష్ప’ మూవీ 2021 డిసెంబర్ లో రిలీజై.. సూపర్ హిట్టుగా నిలిచింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ సినిమాలోని అన్ని పాటలను చంద్రబోస్ ఒక్కరే రాశాడు. ఇక సినిమాలో శ్రీవల్లీ పాటతో పాటు సామి నా సామి, ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా అనే సాంగ్స్ కూడా సూపర్ హిట్టయ్యాయి. ఇక ‘తగ్గేదేలే’డైలాగైతే ఓ రేంజ్ లో మారుమోగింది.