200 ఎకరాల్లో, 2 లక్షల మంది వీక్షించేలా.. దేశంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం

దేశంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రూపుదిద్దుకోనుంది. కోయంబత్తూర్‌లో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నట్లు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ఇది  చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం తర్వాత తమిళనాడులో ఇది రెండవ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కానుంది. 

తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదిత అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను దేశంలోనే అతిపెద్ద సీటింగ్ కెపాసిటీ గల స్టేడియంగా చరిత్రలో నిలిచిపోనుంది. నివేదికల ప్రకారం, దాదాపు 200 ఎకరాల విశాల విస్తీర్ణంలో.. ఒకేసారి 2 లక్షల మంది కూర్చొని వీక్షించేలా దీనిని నిర్మించనున్నారట. ఇప్పటికే డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డిపిఆర్) సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. బిడ్డర్లు నెల రోజుల్లోగా బిడ్‌ దాఖలు చేయాలని కోరారు.

2 లక్షల మంది వీక్షించేలా..

కోయంబత్తూరు నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి NH 544(సేలం, కొచ్చిలను కలిపే రోడ్డు)కి సమీపంలో క్రికెట్ స్టేడియం కోసం కేటాయించిన స్థలం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర జైళ్ల శాఖకు అక్కడ 200 ఎకరాల భూమి ఉండగా, డీపీఆర్‌ తయారీ పూర్తైన తర్వాత అందులో 198 ఎకరాలను స్టేడియం కోసం సేకరించనున్నారు.

ఫైవ్ స్టార్ హోటళ్లు.. క్రికెట్ మ్యూజియం

ఇది పేరుకే క్రికెట్ స్టేడియం కానీ, అక్కడ ఆటగాళ్లకు సకల వసతులు కల్పించనున్నారు. ఫైవ్ స్టార్ హోటళ్లు, క్రికెట్ మ్యూజియం, వీక్షణ గ్యాలరీలు, ఇండోర్ ప్రాక్టీస్ అరేనా, స్పెషలిస్ట్ ఇండోర్ ఫీల్డింగ్ జోన్, పిచ్ క్యూరేషన్ ట్రైనింగ్, లెక్చర్ థియేటర్‌లు, హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌తో సహా సౌకర్యాలను కలిగి ఉండాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇవేకాదు,  క్లబ్‌హౌస్, స్పోర్ట్స్ బార్ వంటివి ఆలోచనలో ఉన్నాయట.

కాగా, లక్ష మంది వీక్షించేలా అహ్మదాబాద్ లో నిర్మించిన నరేంద్ర మోదీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం విస్తీర్ణం 63 ఎకరాలు. దీంతో పోలిస్తే, కోయంబత్తూర్‌లో నిర్మించనున్న దాదాపు మూడు రేట్లు పెద్దది. దీన్ని బట్టి స్టేడియం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.