జై శ్రీరామ్ నినాదంతో.. మరో వివాదంలో తమిళనాడు గవర్నర్

జై శ్రీరామ్ నినాదంతో.. మరో వివాదంలో తమిళనాడు గవర్నర్

తమిళనాడు గవర్నర్ వరుస వివాదాలలో చిక్కుకుంటున్నారు. డీఎంకే ప్రభుత్వం పంపిన పది బిల్లులను ఆమోదించకుండా మూడేళ్లకుపైగా తొక్కి పెట్టడం గత కొంత కాలంగా వివాదం అవుతూ వచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహించి బిల్లులను చట్టాలుగా నోటిఫై చేయాల్సిందిగా సూచించిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో ముగిసిన రోజుల గడువులోనే మరో వివాదానికి  తెరలేపారు. విద్యార్థులతో ‘‘జై శ్రీరామ్’’ అనే నినాదాలు ఇవ్వాల్సిందిగా చెప్పడం వివాదాస్పదం అయ్యింది. 

ఒక ఫంక్షన్ లో విద్యార్థులను జై శ్రీరామ్ అనే నినాదాలు ఇవ్వాల్సిందిగా సూచించారు. దీనిపై తమిళనాడులో తీవ్ర వివాదం మొదలైంది. రాజ్యాంగ పదవిలో ఉండి విద్యార్థులను మతపరమైన నినాదాలు ఇవ్వాల్సింది ఎలా చెబుతారని అధికార, విపక్ష పార్టీల నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. 

తమిళనాడు కామన్ స్కూల్ సిస్టమ్ స్టేట్ ప్లాట్ ఫామ్ (SPCSS-TN) ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. ‘‘గవర్నర్ రవి నిబంధనలు ఉల్లంఘించారు. రాజ్యాంగ సూత్రాలను కట్టుబడి ఉండటంలో విఫలమయ్యారు. ఆర్టికల్ 159 ని ఉల్లంఘించినందుకు వెంటనే గవర్నర్ పదవి నుంచి  తొలగించాలి’’ అని డిమాండ్ చేసింది. 

ఒకవైపు సుప్రీం కోర్టు మందలించింది, మరోవైపు ప్రభుత్వం బ్లాక్ చేసిన తర్వాత గవర్నర్ రవి.. స్టూడెంట్స్ తో జై శ్రీరామ్ నినాదాలు ఇప్పించడం వెనుక.. వ్యవస్థను చికాకు పెట్టడం కోసం కావాలని చేస్తున్న పని ఇది అని కాంగ్రెస్ లీడర్ శ్రీకాంత్ సెంథిల్ అన్నారు. ‘‘కోర్టు మందలించినా.. నా ఎజెండా నేను అమలు చేస్తా’’నని పరోక్షంగా మెసేజ్ పంపుతున్నాడని అన్నారు. ప్రజాస్వామ్య సంస్థలను, రాజ్యాంగ సూత్రాలను తక్కువ చేసేందుకు గవర్నర్ రవి అనుసరిస్తున్న అహంకార ధోరణికి ఇది నిదర్శనం అని విమర్శించారు. 

తమిళనాడు  అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లులను 2020  నుంచి గవర్నర్ ఆర్.ఎన్.రవి పెండింగ్ లో పెడుతూ వస్తుండటం తెలిసిన విషయమే. ఈ బిల్లులపై 2023లో సుప్రీంను ఆశ్రయించింది డీఎంకే ప్రభుత్వం. రాష్ట్ర శాసన సభ తీర్మానించి పంపిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ తనవద్దే పెట్టుకోవడం చట్ట విరుద్ధం అని గత వారం సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి మూడేండ్లు ఎందుకు పట్టిందని సుప్రీం కోర్టు ఆగ్రహం వక్తం చేసింది. ఈ వివాదంలో గవర్నర్ వ్యవహార శైలిని సుప్రీంకోర్టు తప్పపట్టింది. డీఎంకే ప్రభుత్వం ఈ బిల్లులను చట్టాలుగా నోటిఫై చేస్తూ గెజిట్ విడుదల చేయడంతో వివాదం ముగిసింది. వెంటనో మరో వివాదంలో గవర్నర్ ఆర్.ఎన్.రవి చిక్కుకోవడం చర్చనీయం అయ్యింది.