- 30 లక్షల మీటర్ల బట్ట తయారీ ఆర్డర్
- కాటన్, పాలిస్టర్ మిశ్రమ యారన్ తో చీరల తయారీ షురూ
రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల నేతన్నలకు రెండు నెలల ముందే పొంగల్ సంబురం వచ్చింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కడి మహిళలకు అందించే చీరలను సిరిసిల్లలో తయారు చేసేందుకు ఆర్డర్లు ఇచ్చింది. విడతల వారీగా 30 లక్షల మీటర్ల క్లాత్ ను సిరిసిల్ల నేతన్నలతో ఉత్పత్తి చేయిస్తోంది. ఇప్పటికే దాదాపు రెండు లక్షల మీటర్లు క్లాత్ ను తయారు చేసి తమిళనాడుకు పంపించారు. ఈ ఆర్డర్‌తో సిరిసిల్ల నేతన్నలకు రెండు నెలల ఉపాధి దొరుకనుంది.
నాణ్యమైన చీరల తయారీ..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా అందించిన చీరలను నాసిరకం పాలిస్టర్ తో తయారు చేయించింది. తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ కాటన్ తో నాణ్యమైన చీరలను తయారు చేయిస్తోంది. ఈ ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు ఇవ్వడంతో నాణ్యమైన క్లాత్ తో ఉత్పత్తి చేస్తున్నారు. పవర్‌లూమ్స్‌పై ప్రస్తుతం రంగురంగుల చీరల తయారీ కొనసాగుతోంది. సాంచాలపై జకార్డ్, డాబీలను అమర్చుకొని, కొంగు, కింది బార్డర్లను తయారు చేస్తూ అందమైన చీరెలను ఉత్పత్తి చేస్తున్నారు.
పెరిగిన ఉపాధి అవకాశాలు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో లక్ష మంది నేతన్నల్లో ఎక్కువ శాతం వస్త్ర పరిశ్రమ ద్వారానే ఉపాధి పొందుతున్నారు. నాసిరకం బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. నాణ్యమైన కాటర్ చీరల ఆర్డర్ త్వరలోనే అందిస్తామని ప్రకటించింది. వీటి కంటే ముందే తమిళనాడు ఆర్డర్ వచ్చింది. 10 రోజుల కింద ఆర్వీఎం ద్వారా 66 లక్షల మీటర్ల యూనిఫాం క్లాత్ ఆర్డర్‌ను ప్రభుత్వం ఇచ్చింది. రెండు నెలల కింద సంక్షేమ హాస్టల్ విద్యార్థుల యూనిఫాం ఆర్డర్లను సైతం ఇక్కడి నేతన్నలకే అందజేసింది.
ఆర్వీఎం, తమిళనాడు ఆర్డర్లతో సిరిసిల్ల నేతన్నలకు రెండు నెలల చేతినిండా పని దొరుకుతోంది. ఇక తమిళనాడు ఆర్డర్లతో నేతన్నలకు ఉపాధి మరింత పెరిగింది. ఒక్కో ఆసామి నాలుగు సాంచాలపై రోజుకు 160 మీటర్ల క్లాత్ ను ఉత్పత్తి చేస్తున్నాడు. ఒక్కో మీటరుకు రూ.6 కూలీ ఇస్తారు. 160 మీటర్లకు గానూ రూ. 960 గిట్టుబాటవుతోంది. తమిళనాడు ప్రభుత్వం యారన్ కూడా సప్లై చేస్తోంది. నేతన్నలకు పవర్లూమ్స్ పై కేవలం బట్టను ఉత్పత్తి చేసి తమిళనాడు పంపిస్తున్నారు.
చీరల ఉత్పత్తి స్టార్ట్ అయింది
సిరిసిల్లలో తమిళనాడు చీరల ఉత్పత్తి స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే 2లక్షల మీటర్ల క్లాత్ ఉత్పత్తి చేశాం. సిరిసిల్లతో పాటు తంగళ్లపల్లి, గర్శకుర్తి, విలాసాగర్, చొప్పదండి ప్రాంతాల నేతన్నలు కూడా తమిళనాడు చీరల ఆర్డర్లు తీసుకుంటున్నారు. ఆర్వీఎం, తమిళనాడు ఆర్డర్లతో పని దొరుకుతోంది.
వేముల మార్కండేయులు, కమ్యూనిటీ పెసిలిటేటర్
తమిళనాడు చీరలు తయారు చేస్తున్నా..
తమిళనాడు నుంచి ఆర్డర్ రావడంతో చీరలు తయారు చేస్తున్నాను. మీటర్‌కు రూ.6 వస్తున్నాయి. రాష్ట్రాలు దాటి సిరిసిల్లకు ఆర్డర్ రావడం సంతోషంగా ఉంది. రెండు నెలలు పని దొరుకుతోంది. సర్కార్ నుంచి కూడా ఆర్డర్లు వస్తాయని చెబుతున్నారు. దీంతో ఏడాదంతా పని దొరుకుతుంది.
పోలు రాజయ్య, ఆసామి, సిరిసిల్ల