
తమిళనాడు ప్రభుత్వం శశికళకు షాక్ ఇచ్చింది. మాజీ సీఎం.. దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని సోమవారం చెన్నైకు చేరుకున్న అడుగుపెట్టిన 24 గంటల్లోనే ఆమెకు సంబంధించిన ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శశికళ కు సంబంధించిన ఆస్తులను తన ఆధీనంలోకి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది.
తమిళనాడుకు వచ్చిన శశికళ.. జయలలితకు తానే వారుసురాలిని, అన్నాడీఎంకే తనదేనని, తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పూనుకుందని సమాచారం. ఈ క్రమంలోనే వందల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తూత్తుకుడి జిల్లాలో ఉన్న 800 ఎకరాల భూములను ప్రభుత్వం జప్తు చేసింది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కోట్లు విలువ చేసే భూములను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే జప్తు చేసిన ఆస్తులన్నీ ఇలవరసి, సుధాకరన్ పేరుతో ఉన్నట్లు తెలుస్తోంది. శశికళ అక్రమాస్తుల కేసులో ఆస్తుల జప్తునకు సంబంధించి 2017లో సుప్రీంకోర్టు తీర్పునివ్వగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది.