
చెన్నై: తమిళనాడు మంత్రి, డీఎంకే సీనియర్ లీడర్ కె.పొన్ముడి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శైవం, వైష్ణవం, మహిళలను ఉద్దేశించి ఆయన అసభ్యకరమైన కామెంట్లు చేశారు. ఈ నెల 6న జరిగిన ఓ కార్యక్రమంలో పొన్ముడి మాట్లాడుతూ.. సెక్స్ వర్కర్, ఓ వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణగా పేర్కొంటూ మహిళలతో శైవం, వైష్ణవం సంప్రదాయాలను లింక్ పెడుతూ అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో బయటకు రావడంతో పొన్ముడిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, మహిళా లీడర్లు ఆయన తీరుపై మండిపడుతున్నారు. మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
పొన్ముడి వ్యాఖ్యలపై సొంత పార్టీ నేత కనిమొళి కూడా తీవ్రంగా స్పందించారు. ఆయన దారుణమైన వ్యాఖ్యలు చేశారని, వాటిని ఖండిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. పొన్ముడిని మంత్రివర్గం నుంచి తొలగించకుండా డీఎంకే మరో తప్పు చేసిందని మండిపడ్డారు. ‘‘పొన్ముడిని ఇంకా మంత్రివర్గంలో కొనసాగించడం సిగ్గుచేటు. సీఎం స్టాలిన్‌కు ఆయనను అరెస్టు చేసే దమ్ముందా?” అని బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నారాయణన్ తిరుపతి సవాల్ విసిరారు.
సీఎం స్టాలిన్ చర్యలు..
పొన్ముడి చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సీఎం స్టాలిన్ నష్టనివారణ చర్యలు చేపట్టారు. డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి పొన్ముడిని తొలగిస్తున్నట్టు ఆయన శుక్రవారం ప్రకటించారు. అయితే అందుకు కారణం ఏమిటన్నది మాత్రం చెప్పలేదు. పార్టీ రాజ్యసభ ఎంపీ తిరుచి శివను డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమిస్తున్నట్టు వెల్లడించారు.