Tamil Nadu Bus Driver: హ్యాట్సాఫ్ డ్రైవరన్నా..చనిపోతూ కూడా 20 మంది పిల్లలను కాపాడారు

Tamil Nadu Bus Driver: హ్యాట్సాఫ్ డ్రైవరన్నా..చనిపోతూ కూడా 20 మంది పిల్లలను కాపాడారు

సడెన్ హార్ట్ అటాక్.. భరించలేని గుండె నొప్పి.. ప్రాణాలు పైపైకి ఎగిరిపోతున్నట్లు అనిపిస్తుంది.. అయినా బాధ్యతను మరువలేదు.. పసిపిల్లలు అతని కళ్లలో మెదలారు. ఎలాగైనా కాపాడాలనుకున్నాడు.. పంటి బిగువున బస్సు నడిపాడు.. సురక్షితంగా పక్కకు నిలిపాడు. చివరికి తాను మాత్రం ప్రాణాలొదిలాడు.. గుండెను కదిలించే ఘటన.. ఓ స్కూల్ బస్సు డ్రైవర్.. తన ప్రాణం పోతున్నా 20 మంది పిల్లల ప్రాణాలు కాపాడిన సంఘటన తమిళనాడులో జరిగింది. 

తమిళనాడుకు చెందిన సోమలైయప్పన్(49) అనే స్కూల్ బస్సు డ్రైవర్ తాను చనిపోతూ కూడా 20 మంది పిల్లల ప్రాణాలను రక్షించాడు. బస్సు నడుపుతున్న సోమలయప్పన్ కు రన్నింగ్ ఉండగానే హార్ట్ అటాక్ వచ్చింది. ఓ వైపు తీవ్రమైన గుండె నొప్పి బాధిస్తున్నా.. తన బాధ్యత మాత్రం మరిచిపోలేదు.. తాను స్టీరింగ్ వదిలేస్తే బస్సులో ఉన్న 20 మంది పసిపిల్లల ప్రాణాలు పోతాయి.. అది గ్రహించిన డ్రైవర్ సోమలయప్పన్ ప్రాణాలు పోతున్నా సరే.. పంటి బిగువున బస్సు నడిపి సురక్షితంగా పక్కకు నిలిపాడు.. కొద్ది సేపటికే అతను ప్రాణాలు వదిలాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సోమలయప్పన్ ను ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 20 మంది విద్యార్థుల జీవితాలను ప్రమాదం నుంచి బయటపడేసిన అతని ధైర్యం, నిస్వార్థ చర్యకు..‘‘సోమలయప్పన్ నిజమైన హీరో అని నివాళులర్పించారు. సోమలయప్పన్ లాంటి వారు నూటికో కోటికో ఒక్కరుంటారని నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. 

మృతి చెందిన డ్రైవర్ సోమలయప్పన్ నిస్వార్థ సేవకు తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం చలించిపోయారు. సోమలయప్పన్ కు నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.