ఎవరైనా యూట్యూబ్‌లోకి ఎందుకు వస్తారు? పేరు, డబ్బు సంపాదించుకోవడానికే కదా! కానీ.. ఇర్ఫాన్ మాత్రం సరదాగా వీడియోలు చేయడానికి వచ్చాడు. అలాంటిది ఇర్ఫాన్ ఇప్పుడు తమిళనాడులోని టాప్ ఫుడ్ వ్లాగర్లలో ఒకరిగా ఎదిగాడు. అసలు అతనికి మొదట్లో యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయనే విషయమే తెలియదట! ఇప్పుడు యూట్యూబ్ ద్వారా డబ్బు మాత్రమే కాదు.. గుర్తింపు, సినిమా అవకాశాలు కూడా అందుకుంటున్నాడు.
మొహమ్మద్ ఇర్ఫాన్ తమిళనాడులోని చెన్నైలో పుట్టి పెరిగాడు. ఎక్కువగా తమిళంలో ఫుడ్, ఫ్యామిలీ వ్లాగ్స్ చేస్తుంటాడు. గతంలో కుకింగ్ రియాలిటీ షో ‘కుకు విత్ కోమాలి సీజన్–5’లో కూడా పాల్గొన్నాడు. విజయ్ హీరోగా వచ్చిన తమిళ సినిమా ‘లియో’లో ఒక చిన్న పాత్రలో నటించాడు. ఉద్యోగం చేయాలి అనుకున్న తాను యూట్యూబ్‌లోకి ఎలా వచ్చాడు? అతని సక్సెస్‌కి కారణాలేంటి?.. అతని మాటల్లోనే..
‘‘నాకు 2010 నుంచే యూట్యూబ్‌లో వీడియోలు చేయాలనే కోరిక ఉండేది. కానీ.. అందుకు కావాల్సిన గాడ్జెట్స్ లేకపోవడంతో ఆగిపోయా. చదువు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరా. కొన్ని నెలల తర్వాత నా శాలరీతో కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నా. దాంతో 2016లో వీడియోలను రికార్డ్ చేసి, అప్‌లోడ్ చేయడం మొదలుపెట్టా. కానీ.. అది మా పేరెంట్స్‌కి ఇష్టం లేదు. మా నాన్నకు ఎంటర్టైన్మెంట్ స్టార్టప్‌ల మీద మంచి అభిప్రాయం లేదు. అందుకే సంవత్సరం వరకు నేను వ్లాగ్స్ చేస్తున్న విషయాన్ని ఆయనకు తెలియకుండా దాచా. కానీ ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి వ్లాగ్స్ తీస్తున్నా.
ఎవరికీ తెలియనివి..
మొదట్లో యూట్యూబ్‌లో వీడియోలను చేయాలనే కోరిక ఉన్నా ఎలాంటివి చేయాలో తెలిసేది కాదు. అందుకే సినిమా రివ్యూలు చేశా. కానీ.. పెద్దగా వ్యూస్ రాలేదు. ఆ తర్వాత వ్లాగ్స్ చేయడం మొదలుపెట్టా. అయినా.. గుర్తింపు రాలేదు. నా ఛానెల్‌ను వంద మంది సబ్స్క్రయిబ్ చేసుకున్న సందర్భంగా ఒక ఫుడ్ వ్లాగ్ చేశా. దానికి నేను ఊహించినదానికంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అప్పటినుంచి రెగ్యులర్‌గా ఫుడ్ వ్లాగ్స్ చేయడం మొదలుపెట్టా. జనాలకు పెద్దగా తెలియని రెస్టారెంట్లు చాలా ఉంటాయి.
అంతెందుకు కొన్నింటి గురించి ఆ ఏరియాలో ఉండేవాళ్లకు కూడా తెలియదు. అలాంటి రెస్టారెంట్లను గుర్తించి, అక్కడి ఫుడ్‌ని ఎక్స్ప్లోర్ చేయడమే పనిగా పెట్టుకున్నా. అందుకోసం మధురై, సేలం, అహ్మదాబాద్, న్యూఢిల్లీ లాంటి చాలా ప్రాంతాల్లో వీడియోలు చేశా. నేను అందరిలా రెస్టారెంట్ల కోసం గూగుల్‌లో వెతకలేదు. బయటకు వెళ్లి జనాలను అడిగి తెలుసుకున్నా. అందుకే నా వీడియోలు ఫేమస్ అయ్యాయి.
ఇప్పుడు రెస్టారెంట్ల వాళ్లే ‘మా రెస్టారెంట్‌కి రండి’ అని వెల్కమ్ చెప్తున్నారు. పైగా బొద్దుగా ఉండేవాళ్లు ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ తింటుంటే.. చూడ్డానికి బాగుంటుంది. నేను బొద్దుగా ఉండడం కూడా ప్లసయ్యింది.
ఫోన్‌లోనే ఎడిటింగ్
మొదట్లో వీడియోలు ఎలా చేసినా పెద్దగా చూసేవాళ్లు కాదు. పైగా నాకు వీడియోలు చేయాలని ఉన్నా కెమెరా ముందు మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడ్డా. అప్పటికి నా దగ్గర కంప్యూటర్ లేదు. కాబట్టి ఫోన్‌లోనే వీడియోలను ఎడిట్ చేశా. అంత కష్టపడి చేసినా వీడియోలకు వారం రోజుల్లో దాదాపు 40 వ్యూస్ మాత్రమే వచ్చేవి. అందుకే నా వీడియోలను నేనే పదే పదే చూస్తూ వ్యూస్ పెంచుకున్నా. కానీ, యూట్యూబ్ వాటిని ఎప్పుడూ వ్యూస్‌గా పరిగణించలేదు. దాంతో చాలాసార్లు వ్లాగింగ్ మానేయాలి అనుకున్నా. కానీ.. బాగా ఆలోచించి నా నిర్ణయం మార్చుకున్నా.
డైలీ అదే పని
ఇప్పుడు ఛానెల్‌కు బాగా పేరొచ్చింది. వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా కష్టపడాల్సిన పనిలేకుండా పోయింది. బయటకు వెళ్లి ఆరోజు వీడియోలను రికార్డ్ చేసి ఇంటికి వచ్చేస్తా. ఎడిటింగ్ పూర్తి చేసి.. సాయంత్రం 5 గంటల్లోగా ఇంటికి వెళ్లిపోతా. సరదాగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో గడుపుతా. కొన్నిసార్లు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వ్లాగ్స్ ఒకేరోజు షూట్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు దాదాపు12 గంటలు షూటింగ్‌తోనే గడిచిపోతుంది. ఆ తర్వాత స్టూడియోలో మరో 6 గంటలు ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. అయినా.. ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు బాగా రిలాక్స్డ్గా ఉంది.
వీడియో డిలీట్!
కొన్నాళ్ల క్రితం ఇర్ఫాన్ తన భార్యకు పుట్టబోయే బిడ్డ జెండర్‌ని రివీల్ చేస్తూ వీడియో చేశాడు. దాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడంతో ప్రీ–కన్సెప్షన్ అండ్ ప్రీ–నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ (1994)ని ఉల్లంఘించాడని తమిళనాడు ఆరోగ్య శాఖ లీగల్ నోటీసు ఇచ్చింది. ఎందుకంటే.. అలా చెప్పడం ఇండియాలో చట్ట విరుద్ధం. కానీ.. ఇర్ఫాన్ తన భార్యకు దుబాయ్‌లో లింగ నిర్ధారణ పరీక్ష చేయించాడు.
అక్కడ తీసిన వీడియో ఫుటేజీనే తన ఛానెల్లో అప్‌లోడ్ చేశాడు. పైగా వాళ్ల ఫ్యామిలీ అంతా కలిసి చేసుకున్న జెండర్ రివీల్ పార్టీ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ఆ వీడియోలను చూసిన అధికారులు కేసు నమోదు చేసి వాటిని తొలగించాలని చెప్పారు.
ఛానెల్ వ్యూ
ఇర్ఫాన్ తన ఛానెల్ ‘ఇర్ఫాన్ వ్యూ’ని 2009లోనే పెట్టాడు. కానీ.. అందులో 2016 వరకు కంటెంట్ పోస్ట్ చేయలేదు. ప్రస్తుతం ఛానెల్‌కు 4.6 మిలియన్ల సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఇప్పటివరకు 2,778 వీడియోలు అప్‌లోడ్ చేశాడు. కొన్నాళ్ల నుంచి ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఒక వీడియో పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బుతోపాటు ప్రమోషన్స్ ద్వారా కూడా సంపాదిస్తున్నాడు.