
తమిళనాడులో నడుస్తున్న త్రిభాషా వివాదం రాజకీయ రంగు పులుముకున్నది. తమిళ్, ఇంగ్లీష్, హిందీ భాషలు కచ్చితంగా నేర్చుకోవాలన్న విధానానికి వ్యతిరేకంగా.. తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ నిరసనలు వ్యక్తం చేస్తుంది. తమిళ భాషను చంపేందుకే హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారంటూ డీఎంకే పార్టీ.. కేంద్రంపైన, బీజేపీపైనా విరుచుకుపడుతుంది. ఈ క్రమంలోనే తమిళనాడులోని బీజేపీ పార్టీ రంగంలోకి దిగింది. త్రిభాషా విధానం.. తమిళనాడులో హిందీకి మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టింది.
ఈ క్రమంలోనే చెన్నై సిటీలో జాతీయ విద్యా విధానానికి మద్దతుగా సంతకాల సేకరణకు పిలుపునిచ్చింది బీజేపీ పార్టీ. ఇందులో భాగంగా తమిళనాడు బీజేపీ మహిళా నేత, తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై సంతకాల సేకరణ చేపట్టారు. చెన్నై సిటీలోని ఎంజీఆర్ నగర్ లో ప్రచారం నిర్వహించారు. మూడు భాషల విధానానికి మద్దతుగా ప్రజల నుంచి, విద్యార్థుల నుంచి సంతకాలు సేకరించటం మొదలుపెట్టారు.
Also Read :- నానక్రామ్ గూడలో హైడ్రా కమిషనర్ చెరువుల పరిశీలన
ఈ విషయం తెలిసిన డీఎంకే పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎంజీఆర్ నగర్ చేరుకున్నారు. తమిళసై ప్రచారాన్ని అడ్డుకున్నారు. బీజేపీ డౌన్ డౌన్.. గో బ్యాక్ బీజేపీ, తమిళ ద్రోహి పార్టీ బీజేపీ అంటూ నినాదాలు చేశారు. డీఎంకే కార్యకర్తల నిరసనలకు కౌంటర్ గా బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.. డీఎంకే డౌన్ డౌన్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. దీంతో ఎంజీఆర్ నగర్ లో డీఎంకే, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నిరసనలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. ట్రాఫిక్ జాం అయ్యింది.
విషయం తెలిసిన పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. సంతకాల సేకరణకు అనుమతి లేదని.. పర్మీషన్ లేకుండా ఎలా ప్రచారం చేస్తారంటూ బీజేపీ నేత, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు.
తమిళిసైను బలవంతంగా అరెస్ట్ చేయటంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై స్పందించారు. డీఎంకే పార్టీ నిరంకుశ వైఖరికి ఇది నిదర్శనం అని.. మూడు భాషల విధానం ఉంటే తప్పేంటని.. తమిళనాడు ప్రజలు హిందీ నేర్చుకోకూడదా అని ప్రశ్నించారు.