పరోటా సూరి హీరోగా విడుదల

సూరి... ఈ పేరు మనవాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఆయన్ని స్క్రీన్​ పై చూస్తే, బాగా పరిచయం ఉన్నట్టు, పక్కింటి కుర్రాడిలా అనిపిస్తాడు. స్క్రీన్​లో ఆయన కనిపించినంతసేపు ఆడియెన్స్ నవ్వుతూనే ఉంటారు. హీరో పక్కనే ఉంటూ కడుపుబ్బా నవ్వించే ఈ కమెడియన్.​. తమిళనాట మంచి పేరు తెచ్చుకున్నాడు. చూడ్డానికి నల్లగా, బక్కపలచగా ఉండే ఇతను కామెడీ పండించడంలో దిట్ట. పాతికేండ్లుగా ఇండస్ట్రీలో కామెడీ పాత్రలు చేస్తున్నాడు. కానీ, ఇన్నేండ్ల తర్వాత పాపులర్​ డైరెక్టర్ వెట్రిమారన్​ డైరెక్షన్​లో హీరోగా ఎంట్రీ ఇచ్చి సర్​ప్రైజ్​ చేశాడు. ‘విడుదల’ సినిమాతో హీరోగా కొత్తదనం ట్రై చేసిన సూరి, పాతికేండ్ల సినిమా జర్నీ గురించి తన మాటల్లోనే....

‘‘నా పూర్తి పేరు సూరి ముత్తుస్వామి. పుట్టింది తమిళనాడులోని మధురైలో. చిన్నప్పటి నుంచి నటనంటే ప్రాణం. ఎలాగైనా సరే సినిమాల్లో చేయాలని1996లో మధురై నుంచి చెన్నై వెళ్లిపోయా. సినిమా అవకాశాల కోసం చాలా రకాలుగా ప్రయత్నించా. కానీ, నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. అయినా నేను నిరాశ పడలేదు. చెన్నైలోనే ఉండి ఏదో ఒకరకంగా ప్రయత్నిస్తూనే ఉండాలనుకున్నా. అప్పుడు సిటీలో స్వీపర్​గా పని దొరకడంతో ఆ పనిచేశా. ఆ టైంలో సినిమాల్లోకి రావడానికి నా ఫ్రెండ్, రిలేటివ్​ సుమతి నాకు బాగా సపోర్ట్​ చేసింది. నేను తినడానికి, ఆఫీస్​ల చుట్టూ తిరగడానికి తనే సాయం చేసింది. కాస్టింగ్​ ఏజెన్సీతో మాట్లాడి నన్ను కలవమని పంపేది. ‘కాదలుక్కు మరియాధై’ అనే సినిమాలో1997లో డాన్సర్​గా, 1998లో ‘మారు మలార్చి’ అనే సినిమాలో ఆడియెన్స్​లో ఒకడిగా ఛాన్స్​ వచ్చింది. ఆ తర్వాత తోట తరణి ఆర్ట్​ టీంలో ఒకరిని పరిచయం చేసుకుని, సినిమా సెట్​కి చాలాసార్లు వెళ్లేవాడిని. అతను నాకు అప్రెంటీస్​గా పని ఇప్పించాడు. 

కెరీర్​ మొదలైంది ఇలా

ఆర్ట్​ టీంలో పనైతే దొరికింది కానీ, నటించే అవకాశాలేం రాలేదు. అలా1999 నుంచి 2003 వరకు సెట్ అసిస్టెంట్, ఫొటో ప్లేట్ ట్రైనీ, ఎలక్ట్రీషియన్​ వంటి రకరకాల పనులు చేశా. ప్రభుదేవా హీరోగా వచ్చిన ‘నినైవిరుక్కుమ్​’(1999)లో జానకిరామ్ ఫ్రెండ్​గా నటించా. ప్రశాంత్​ హీరోగా వచ్చిన ‘విన్నర్’  అనే సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్​గా చేశా. ఇలా గుర్తింపు లేని పాత్రలెన్నో చేశా. మొదటిసారి 2004లో ‘వర్ణజలం’ అనే సినిమాలో దొంగగా నటించా. అప్పటి నుంచి కొంచెం గుర్తుండే పాత్రలే రావడం మొదలైంది. అందులో ఆడియెన్స్​కి బాగా దగ్గరైన పాత్ర సుబ్రమణి. ‘వెన్నిల కబడ్డీ కుళు’ (2009)లో కబడ్డీ టీం ప్లేయర్​గా నటించా. అందులో పరోటా ఛాలెంజ్ అనే సీన్ ఉంటుంది. ఆ సీన్​లో ఛాలెంజ్​ గెలవాలని 50 పరోటాలు తింటా. మరో 50 పరోటాలు తీసుకురండి అనగానే... ఆడియెన్స్​ బాగా నవ్వుకునేవాళ్లు. అప్పటి నుంచి నన్ను ‘పరోటా’ సూరిగా గుర్తు పట్టడం మొదలైంది. స్క్రీన్​ మీద నేను కనిపించినా, వన్​ లైన్​ పంచ్​లు వేసినా జనం బాగా నవ్వేవాళ్లు. ఆ తర్వాత ‘సుందరపాండియన్ (2012), వెలైను వంధుట్ట, పాండ్య నాయుడు, జిల్లా’ వంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. ‘తిరుమతి సెల్వం’ పేరుతో సన్​టీవీలో 2007 నుంచి 2013 వరకు ఒక టీవీ సీరియల్ వచ్చింది. అందులో ‘అమృతం’ పాత్రలో కనిపించా. ‘పోరలి’ అనే సినిమా 2011లో వచ్చింది. అందులో ‘సూరి’ పాత్రలో చేశా. ఆ క్యారెక్టర్​కి బెస్ట్​ కమెడియన్​గా ‘నార్వే తమిళ ఫిల్మ్​ ఫెస్టివల్ అవార్డు’ వచ్చింది. అదే నా మొదటి అవార్డ్. ఆ తర్వాతి ఏడాది తెలుగులోనూ ఒక సినిమాలో నటించా. ఆర్.​పి. పట్నాయక్​ డైరెక్షన్​లో వచ్చిన ‘ఫ్రెండ్స్ బుక్’ అనే సినిమాలో చేశా. అలా వచ్చిన ప్రతి సినిమాలో నటిస్తూ వెళ్లా. ఇప్పటికి దాదాపు వంద సినిమాలు చేసుంటా. అవన్నీ కమెడియన్​గా మంచి గుర్తింపు ఉన్న పాత్రలే. కొన్నింటికి అవార్డ్​లు కూడా వచ్చాయి. 

హీరోగా ‘విడుదల’

పాతికేండ్ల నా యాక్టింగ్​ కెరీర్​లో కమెడియన్​గా ముద్రపడిపోయింది. అలాంటిది నన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలనుకుంటే అది కామెడీ సినిమానే అవుతుంది అనుకుంటారు ఎవరైనా. అలా అనుకునే కామెడీ హీరోగా చేయడానికి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, నేను అవేవీ ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పటికే చేసే సినిమాల్లో కమెడియన్​గానే చేస్తున్నా. హీరోగా చేస్తే ఎక్కువసేపు స్క్రీన్​ మీద కనిపిస్తా. అంతేకానీ తేడా ఏముంది? అందుకని ఒప్పుకోలేదు. కానీ, వెట్రి మారన్​ లాంటి సక్సెస్​ఫుల్​, ఎమోషనల్​ డైరెక్టర్​తో సినిమా చేయాలంటే ఎవరికైనా కొంచెం భయం ఉంటుంది. నాక్కూడా అలానే ఉండేది. నిజానికి వెట్రి మారన్​ సినిమాలో ఒక్కసారైనా కనిపించాలనే ఆశ ఉండేది. కానీ, నేను చేస్తున్న స్టయిల్​ కామెడీ ఆయన సినిమాల్లో కనిపించదు అనేవాళ్లు చాలామంది. ఒకసారి ఆయన్ని ఆఫీస్​లో కలిసినప్పుడు ‘కరైకుడి’ కథ చెప్పారు. అందులో ఐదు పాత్రల గురించి చెప్పారు. వాటిలో ఒక క్యారెక్టర్​ నాకు ఇస్తారనుకున్నా. కథ చెప్పడం అయిపోయాక, ‘ఈ సినిమాలో నువ్వే మెయిన్​ రోల్​లో నటించాలి’ అన్నారు. కాకపోతే ఆ టైంలో ఆయన ‘వడ చెన్నై’ అనే సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఏడాది పాటు నాకు అప్​డేట్ రాలేదు. ఆ తర్వాత నాకు ఫోన్​ చేసి, ధనుష్​తో ‘అసురన్’ చేయాలని చెప్పాడు. ఇక తను స్టార్స్​నే వెతుక్కుంటాడేమో నాకు ఛాన్స్ మిస్​ అవుతుందని భయపడ్డా. మళ్లీ కొన్నాళ్లకు ఆయనే ఫోన్ చేసి, ‘మనం ఫస్ట్ అనుకున్న ప్రాజెక్ట్ చేయడం లేదు. నవల ఆధారంగా మరొకటి చేస్తున్నాం”అని కొత్త కథ ఒకటి చెప్పాడు. ప్రి – ప్రొడక్షన్​ పనులు మొదలయ్యాయి. లొకేషన్ వెతకడం అయిపోయింది. నా ఫొటో షూట్​ కూడా స్టార్ట్ అయింది. సరిగ్గా అప్పుడే కరోనా వచ్చింది. విదేశాల్లో షూటింగ్​ చేయడం వీలుకాని పరిస్థితులు అవి. దాంతో ఆ అవకాశం కూడా చేజారిపోయింది. 

కానిస్టేబుల్ కుమరేశన్

మూడోసారి... మళ్లీ నాకో కథ చెప్పారు వెట్రి. అది నాకు నచ్చింది.. షూటింగ్​ పూర్తయ్యి, ‘విడుదల’ రూపంలో తెరపైకి వచ్చింది. ఇది రెండు పార్ట్​లుగా తీసిన సినిమా. ఇందులో నాది ‘కుమరేశన్’ అనే కానిస్టేబుల్ పాత్ర. కానిస్టేబుల్ కుమరేశన్ కన్న కలలు ఏవీ జరగవు. దాంతో తను లోలోపల చాలా బాధపడుతుంటాడు. నేను ఇలాంటి వ్యక్తులను చాలామందిని చూశా. రాజకీయ నాయకులకు భద్రత కల్పించడం, పెద్ద ఈవెంట్స్​ గ్రూపుల్లో కనిపించడం లేదా రోడ్లపై పోలీసింగ్ చేయడం వంటివి చేస్తున్నారు. వాళ్ల శరీరాలు ఫిట్‌‌‌‌గా ఉంటాయి. కానీ వాళ్ల ముఖాలు మనకు కథలు చెప్తుంటాయి. వాళ్లు వేసుకున్న యూనిఫాం గురించి ప్రౌడ్​గా ఫీలవుతారు. అదొక ఎమోషనల్ జర్నీ. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా గురించి చాలా విశేషాలున్నాయి. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, సంగీతం ఇళయరాజా, ఇందులో ఒక పాట ధనుష్​ పాడారు. బోలెడన్ని సర్​ప్రైజ్​లు.’’

నవ్వించే నేను...

హాస్య నటుడు ఎలాంటి పాత్ర అయినా చేయగలడని నా నమ్మకం. కానీ ఇది వెట్రి మారన్  సినిమా. షూటింగ్​లో మొదటి రోజే, పాత్రలోని ఎమోషన్స్‌‌‌‌ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టా. అది గమనించిన దర్శకుడు, నాకు ఫోన్ చేసి ‘కుమరేశన్ ఎలాంటి వ్యక్తి’ అనేది చెప్పి అందుకు కావాల్సిన సమాచారం అంతా తీసుకోమని చెప్పాడు. ఆ తర్వాతే షూటింగ్​ చేశాం. వెట్రి చాలా గొప్ప మనసున్న మనిషి. నేను ఈ సినిమా షూటింగ్​లో ఉన్నా.. వేరే సినిమాల్లో కమెడియన్ రోల్స్ మిస్ కాకూడదని, ఆ షూటింగ్స్​కి  వెళ్లేందుకు టైం ఇచ్చాడు. అప్పుడు చేసినవే ‘డాన్, విరుమన్, ఎదరుక్కుమ్ తునింధవన్’ సినిమాలు. అదే టైంలో రజినీకాంత్​ ‘అన్నాత్తె’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ విషయం తెలియగానే ‘ఆయనతో నటించాలనేది ప్రతి నటుడి కల. నువ్వెళ్లి ఆ సినిమాలో చెయ్యి’ అని ఎంకరేజ్ చేశాడు వెట్రి. 

::: ప్రజ్ఞ