చెన్నై: తమిళనాడులో రోడ్డు పక్కన బండి పెట్టుకుని పానీ పూరీ అమ్ముకుంటున్న ఒకతను రూ.40 లక్షలు సంపాదించాడు. ఫోన్ పే(PhonePe), రేజర్ పే (Razorpay) ద్వారా ఆ పానీ పూరీ వ్యాపారికి రూ.40 లక్షలు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ కావడం గమనార్హం. అన్నేసి లక్షలు వ్యాపారంలో ఆర్జిస్తున్నా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో ఆ పానీ పూరీ వ్యాపారి ఫోన్ పే, రేజర్ పే ట్రాన్షాక్షన్స్ డేటా ఆధారంగా తమిళనాడు జీఎస్టీ డిపార్ట్మెంట్ అతనికి నోటీసులు జారీ చేసింది. అతనికి జారీ చేసిన నోటీసులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
— Jagdish Chaturvedi (@DrJagdishChatur) January 2, 2025
వాస్తవానికి ఇండియాలో రోడ్ల పక్కన చిన్నాచితకా వ్యాపారాలు చేసుకునే వాళ్లకు వ్యాపారులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ అంత తప్పనిసరి కాదు. ఎందుకంటే.. రోడ్ల పక్కన వ్యాపారాలు చేసుకునే వాళ్ల సంవత్సరం సంపాదన మొత్తం కలిపినా రూ.10 లక్షలకు మించి దాటకపోవచ్చు. వ్యాపారం బాగా సాగిందనుకుంటే మరో 5 లక్షలు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు రూ.15 లక్షలకు మించి వార్షికాదాయం వచ్చే పరిస్థితి ఉండదు. అయితే మన దేశంలో ఒక చట్టం ఉంది. సెక్షన్ 22(1) జీఎస్టీ యాక్ట్ ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో బిజినెస్ టర్నోవర్ 20 లక్షల రూపాయలకు మించితే జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇక్కడే ఈ తమిళనాడు పానీ పూరీ వ్యాపారి జీఎస్టీ అధికారులకు దొరికిపోయాడు.
ఫోన్ పే, రేజర్ పే ద్వారా ఈ పానీ పూరీ వ్యాపారికి కస్టమర్లు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ 40 లక్షలు చెల్లించారు. అంటే.. 2024లో పానీ పూరీ బండి ద్వారా ఈ వ్యాపారి రూ.40 లక్షలు సంపాదించాడు. ఈ 40 లక్షలు అతనికి ఫోన్ పే, రేజర్ పే ద్వారా వచ్చినవి మాత్రమే. పానీ పూరీ బండి దగ్గర తినేసి చేతికి డబ్బులు ఇచ్చి వెళ్లిపోయే వాళ్లు కూడా ఉంటారు కద. ఆ డబ్బు కూడా పానీ పూరీ వ్యాపారంలో సంపాదనేగా. ఒక్కమాటలో చెప్పాలంటే డిజిటల్ చెల్లింపులు ఈ పానీ పూరీ వ్యాపారి రూ.40 లక్షల సంపాదన గురించి తమిళనాడు జీఎస్టీ డిపార్ట్మెంట్కు తెలిసేలా చేశాయి. అతనికి జీఎస్టీ అధికారులు నోటీసులు పంపారు. గత మూడేళ్లుగా ఇంత పెద్ద మొత్తంలో లాభాలొస్తున్నా ఈ పానీ పూరీ వ్యాపారి జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు.
పానీపూరీ బిజినెస్ ఇండియాలో ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. సాయంత్రం అయితే చాలు.. అలా సరదాగా బయటకు వెళ్లి పానీపూరీ, కట్లెట్ తినేవాళ్లకు కొదవే లేదు. ఇండియాలో జోరుగా సాగే వ్యాపారాల్లో పానీపూరీ టాప్-5లో ఉంటుందనడంలో సందేహమే లేదు. పానీపూరీ వ్యాపారం చేసేవాళ్ల సంపాదన గురించి తెలుసుకుని జాబ్ మానేసి పానీపూరీ బండి పెట్టుకోవడం బెటరేమో అని ఫీలయిన వాళ్లూ చాలామందే ఉన్నారు. ఐదంకెల జీతమొస్తున్నా.. ఉద్యోగంలో పని ఒత్తిడి తట్టుకోలేక పానీ పూరీ స్టాల్ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్న వాళ్లు కూడా ఇండియాలో ఉన్నారు.