ఆ  ఊళ్ళో చెప్పులు వేసుకోరు... బయటవారికి కూడా ఇదే రూల్.. ఎందుకంటే..

ఆ  ఊళ్ళో చెప్పులు వేసుకోరు... బయటవారికి కూడా ఇదే రూల్.. ఎందుకంటే..

శాస్త్ర సాంకేతిక రంగాలలో మన దేశం దూసుకుపోతున్నా ఇక్కడ మాత్రం చెప్పులు తీసి  నడవాల్సిందే.. చెప్పులు వేసుకొని నడిస్తే ఏమవుతుంది ?ఆ గ్రామస్తుల్ని ప్రశ్నిస్తే అందరి నోటా ఒకే మాట వినిపిస్తోంది. మా ఇష్టం మాకూ కొన్ని ఆచారాలుంటాయి అంటున్నారు ఆ గ్రామస్తులు.  ఇంతకూ ఆగ్రామం పేరేమిటి.. అదెక్కడ ఉంది.. ఆగ్రామస్తుల ఆచార .. వ్యవహారాలేంటో తెలుసుకుందాం.  .

మన దేశంలో ఎన్నో అందమైన ప్రాంతాలున్నాయి. కొన్నిచోట్ల వింత ఆచారాలు, విచిత్రమైన సంప్రదాయలు కనిపిస్తుంటాయి తమిళనాడులోని వెల్లగావి  ఊర్లో జనాలు చెప్పులేసుకుని తిరగరు. అడిగితే.. మా కారణాలు మాకున్నాయ్...' అంటున్నరు.  ఇది మీ మూఢ నమ్మకం అని ఎవ్వరైనా వారితో వారిస్తే ఆ గ్రామం నుండి బయటకు రావడం కూడా కష్టమే. ఎందుకంటే పిల్లల నుంచి పండు ముసలి వరకు ఆ గ్రామంలోకి ఎంటరవ్వాలంటే చెప్పులు తీసి నడవడం సంప్రదాయంగా వస్తోంది.  అంటే వాళ్ళ కట్టు బాట్లు ఎంత కఠినంగా ఉన్నాయో తెలుస్తుంది.

తమిళనాడు దిండిగల్ జిల్లా గుట్టల మీద విస్తరించిఉంది కొడైకెనాల్. దీనిని అనుకుని వెల్లగావి అనే చిన్న గ్రామం ఉంది. ఇక్కడ నూటయాభైకి పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. దట్టమైన అడవిలో చుట్టూ పచ్చదనం, సెలయేర్ల పరవళ్లతో ఎంతో సుందరంగా ఉంటుంది ఈ ఊరు. అయినా కూడా దీనిని టూరిస్ట్ స్పాట్లో చేర్చలేదు. అందుకు కారణం ఇక్కడికి రోడ్డులేకపోవడమే. ఆగ్రామం పొలిమేర వచ్చాక ఎంతటి వారైనా సరే చెప్పులు తీసి రావాల్సిందే.. బయట వారైనా సరే ఆగ్రామానికి వస్తే చెప్పులు తీసి నడవాల్సిందే. ఆ గ్రామం లో వందల సంవత్సరాల నుంచి ఉన్న కట్టుబాటు. కాదంటే ఆ గ్రామంలోకి నో ఎంట్రన్స్​.

ఈ ఊరికి వెళ్లాలంటే ట్రెక్కింగ్ చేయాల్సిందే. విచిత్రం ఏంటంటే.. ఇక్కడ ఇళ్ల కంటే గుళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే ఈ ఊరిని పవిత్రంగా భావిస్తారు ఇక్కడి జనాలు. దేవుళ్లు.. భక్తులు ఒకే ఊళ్లో ఉంటున్నారు. అందుకే అక్కడి జనాలు చెప్పులేసుకోరు. ఎవరైనా ఈ ఊరికి రావాలంటే చెప్పులు విప్పి ఉత్తికాళ్లతో రావాలి. ఈ సూచనతో కొండ ప్రాంతంలో అక్కడక్కడా టూరిస్ట్ల కోసం ప్రత్యేకంగా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. 

కష్టమే, కానీ ఇష్టంగా..

వెల్లగానికి మూడు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఊర్లోకి అడుగుపెట్టగానే ఒక పెద్ద గుడి ఎంట్రెన్స్ కనిపిస్తుంది. ఇళ్ల మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న గుళ్లు ఉంటాయి. చుట్టూ కొండలు, పచ్చదనం.. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ అక్కడ చదువుకునేందుకు స్కూల్ లేదు. ఒక చాయ్ దుకాణం, చిన్న కిరాణ షాప్ మాత్రమే ఉంటాయి. ఏదైనా అవసరం పడితే కొండలు దాటుకుంటూ కొడైకెనాల్ వెళ్లాల్సిందే. రోజూ కష్టాలే. అయినా కూడా ఎంతో ఆనందంగా ఉంటున్నారు వెల్లగావి ప్రజలు. ఆ సంగతి పక్కనపెడితే ప్రకృతి అందాలతో ట్రెక్కింగు మాత్రం ఈ ప్రాంతం స్వర్గమనే చెప్పాలి