హైదరాబాద్: తెలంగాణ సమస్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడానని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అయితే మీటింగ్ లో తాము చర్చించిన విషయాలన్నీ చెప్పలేనన్నారు. తెలంగాణతోపాటు పుదుచ్చేరి గురించి షాతో మాట్లాడానన్నారు. తానెప్పుడూ నిర్మాణాత్మకంగా ఆలోచిస్తానని.. తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తానన్నారు. ఈనెల 11న జరిగే భద్రాద్రి రాముడి పట్టాభిషేకానికి.. రైలు లేదా రోడ్డు మార్గంలోనే వెళ్తానన్నారు. సమ్మక్క, సారలమ్మ దర్శనానికీ రోడ్డు రూట్ లోనే వెళ్లానని గుర్తు చేశారు. తెలంగాణలో ఏం జరుగుతుందనేది అందరికీ తెలుసన్నారు.
యాదాద్రి లక్ష్మీ నర్సన్నను దర్శించుకోవడానికి వెళ్లిన తనను బీజేపీ నేత అని ఎలా అంటారని తమిళిసై క్వశ్చన్ చేశారు. ఓ భక్తురాలిగా మాత్రమే తాను యాదాద్రికి వెళ్లానన్నారు. తాను బాధ్యతాయుతమైన వ్యక్తినని.. పార్టీలతో సంబంధం లేకుండా అందర్నీ తాను కలిశానన్నారు. ‘సీఎం, మంత్రుల కోసం రాజ్ భవన్ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. గవర్నర్ ఆఫీసుకు ఎందుకు రావడం లేదో వాళ్లే చెప్పాలి. ఏదైనా ఉంటే నన్ను అడగాలి, నేను సమాధానం చెబుతా. అలాగే సీఎస్, డీజీపీ, ఇతర అధికారులు వచ్చి వివరణ ఇవ్వాలి. గణతంత్ర, ఉగాది వేడుకలకు ఎందుకు రాలేదు? ఇదేనా వారిచ్చే మర్యాద? సీఎం సహా అందరినీ ఆహ్వానించా. నేను ఆధారాలు చూపిస్తా. ఇది తమిళిసై సమస్య కాదు.. గవర్నర్ ఆఫీస్ కు జరుగుతున్న అవమానం’ అని తమిళిసై ఫైర్ అయ్యారు.