Tamim Iqbal: నా చాప్టర్ ముగిసింది: అంతర్జాతీయ క్రికెట్‌కు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ రిటైర్మెంట్

బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 17 ఏళ్ళ పాటు బంగ్లాదేశ్ కు ప్రాతినిధ్యం వహించిన తమీమ్ శుక్రవారం (జనవరి 10) ఫేస్‌బుక్‌లో పోస్ట్ తాను రిటైర్ అవుతున్నట్టు తెలిపాడు. "అంతర్జాతీయ క్రికెట్‌లో నా అధ్యాయాన్ని ముగించాను. చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాను. మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం కష్టం" అని షకీబ్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. 

కొంతకాలంగా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నానని..   కొన్ని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వంటి కీలక  టోర్నమెంట్‌ల ముందు జట్టుకు అంతరాయం కలిగించకుండా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తమీమ్ వివరించాడు.క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం తమీమ్ కు ఇది రెండోసారి. అంతకుముందు 2023లో క్రికెట్ కు వీడ్కోలు తెలిపాడు. అయితే  బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా క్రికెట్ ఆడాల్సిందిగా కోరడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇదిలా ఉండగా, ఈ సారి అతను తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయం ఫైనల్ అని తెలుస్తుంది. 

ఇక్బాల్ ఇప్పటికే టీ20 క్రికెట్ నుండి 2022లో రిటైర్ అయ్యాడు. బంగ్లాదేశ్  తరుపున ఓపెనర్ గా ఇక్బాల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఇక్బాల్ బంగ్లాదేశ్ తరఫున 70 టెస్టులు, 243 వన్డేలు, 78 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. తన క్రికెట్ లో 25 సెంచరీలు, 94 హాఫ్ సెంచరీలతో అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేలకు  పైగా పరుగులు సాధించాడు.