Tamim Iqbal: గుండె పోటుతో గ్రౌండ్‌లోనే పడిపోయిన స్టార్ క్రికెటర్.. పరిస్థితి విషమం

Tamim Iqbal: గుండె పోటుతో గ్రౌండ్‌లోనే పడిపోయిన స్టార్ క్రికెటర్.. పరిస్థితి విషమం

క్రికెట్ లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ఆడుతూ బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ తమీమ్ ఇక్బాల్‌ గుండె పోటుతో మైదానంలో కుప్పకూలాడు. సోమవారం (మార్చి 24) సావర్‌ వేదికగా BKSP స్టేడియంలో మొహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్, షైనెపుకుర్ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన జరిగిన మ్యాచ్ లో ఈ విచార సంఘటన చోటు చేసుకుంది. ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో తమీమ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఛాతీ నొప్పితో ఇబ్బంది పడ్డారు. నొప్పి తీవ్రం కావడంతో తమీమ్ అక్కడే పడిపోయాడు. 

ALSO READ | CSK vs MI: గైక్వాడ్, ఖలీల్‌పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు.. బ్యాన్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్!

తమీమ్‌ను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లడానికి హెలికాప్టర్ లో ఢాకాకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. దీంతో తమీమ్‌ను స్థానిక ఫజిలతున్నేస ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఆసుపత్రిలో ఆయనకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా.. అక్కడ తేలికపాటి గుండె సమస్యలు ఉన్నట్లు అనుమానం వచ్చింది. వైద్య నివేదికలు తమీమ్ కు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని నిర్ధారించాయి. 

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజీషియన్ డాక్టర్ దేబాషిష్ చౌదరి.. తమీమ్‌కు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని ధృవీకరించారు. తమీమ్ గురించి అప్‌డేట్ ఇస్తూ మహమ్మదీయ అధికారి తారిఖుల్ ఇస్లాం మాట్లాడారు. "తమీమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు. అతని పరిస్థితి విమానంలో ఢాకాకు తరలించేంత బాగా లేదు" అని అన్నారు. తమీమ్ పరిస్థితి విషమంగా ఉందని.. అతనికి లైఫ్ సపోర్ట్ అందించబడిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. 

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్ ఢాకా ప్రీమియర్ లీగ్ లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు, టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన నాల్గవ ఆటగాడిగా నిలిచాడు. ఏడు మ్యాచ్‌ల్లో ఈ మాజీ బంగ్లా కెప్టెన్ 73.60 సగటుతో 368 పరుగులు చేశాడు. అతని ఖాతాలో రెండు సెంచరీలు ఉన్నాయి. 

బంగ్లాదేశ్  తరుపున ఓపెనర్ గా ఇక్బాల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఇక్బాల్ బంగ్లాదేశ్ తరఫున 70 టెస్టులు, 243 వన్డేలు, 78 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. తన క్రికెట్ లో 25 సెంచరీలు, 94 హాఫ్ సెంచరీలతో అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేలకు  పైగా పరుగులు సాధించాడు.